హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ ఉద్యాన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి స్వయంగా బత్తాయి జ్యూస్ తీసి అందరితో తాగించారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయిన రైతాంగానికి అండగా ప్రభుత్వం ప్రారంభించిన "ఫ్రూట్ డే"కు ప్రచారం విస్తృతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తలసరి పెంపు కోసం ఫలరాజు మామిడి, బత్తాయి, నిమ్మ ఆవశ్యకత గురించి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏటా సీజన్‌లో ఉత్పత్తయ్యే మామిడి, బత్తాయి పండ్లను అమెరికా, యూకే, సౌదీ అరేబియా దేశాల ప్రజలు విరివిగా తింటుంటే... సుగుణాలు తెలియక మనం తినడం లేదని చెప్పారు.
జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు
రాష్ట్రంలో పండించిన నాణ్యమైన బత్తాయి, బంగినపల్లి, హిమాయత్ వంటి మామిడి రకాలు, నిమ్మకాయల తలసరి వినియోగం గణనీయంగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా సురక్షిత, ఆరోగ్యంతోపాటు రైతులకు మంచి ఆదాయం ఇచ్చి ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు. సిట్రస్ జాతి పండ్లు రోజూ తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరిగి కరోనా లాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని వెంకటరామిరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు సరోజినీదేవి, బాబురావు, మదన్‌మోహన్, ఎన్-రైప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత