హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం (Rain in city) కురుస్తోంది. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసురుపట్టడంతో పాటు వర్షం కురవడంతో వివిధ పనులపై రహదారులపై వెళ్తున్న వాహనదారులు, బాటసారులు వర్షంలోనే తడుచుకుంటూ వారి వారి కార్యాలయాలకు చేరుకున్నారు.
వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు.
నెక్లెస్ రోడ్డులో 15 నిమిషాలు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, హైదర్‌గూడ, నారాయణ గూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, లక్డీకాపూల్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, బేగంపేట, బోయిన్పల్లి. చిలకలగూడ, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, మూసాపేట, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, కూకట్ పల్లి, గాజులరామారం, జీడిమెట్లస సుచిత్ర, కొంపల్లి బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
భారీ వర్షానికి... ప్రధాన రహదారులపై భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కాగా... వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పీజీ న్యాయ కళాశాల రోడ్డులో పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. లక్డీకాపూల్‌లో వివిధ దుకాణాలలో భారీగా నీరు చేరింది. ఇంజిన్లోకి నీరు చేరడం వల్ల కొంతమంది వాహనాలు తోసుకుంటూ వెళ్లారు.
ఇదీ చూడండి: Weather Update: తెలంగాణలో ఉపరితల ద్రోణి.. 3 రోజులు వర్షసూచన