Inspector extorting money from spa centers hyderabad : మసాజ్, స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాల్ని నియంత్రించాల్సిన ఆయనే.. అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ఇన్‌స్పెక్టర్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదను దొరికిన చోటల్లా వసూళ్లకు పాల్పడుతున్న ఆయన నిర్వాకాలను గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
money extortion from spa centers Hyderabad : బెడ్డుకు రూ.5 వేల చొప్పున.. సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ తన పరిధిలోని మసాజ్, స్పా సెంటర్లను గుర్తించి.. తనిఖీలతో హడావుడి చేసి పంజా విసురుతున్నాడు. నెలవారీ కమీషన్ తనకు ముట్టజెప్పకపోతే దాడులతో వణుకు పుట్టిస్తున్నాడు. మాదాపూర్ జోన్‌లోని ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో మసాజ్, స్పా సెంటర్ ఉంది. దీని నుంచి నెలకు రూ.1.8 లక్షల చొప్పున ఆయనకు ముట్టడి అందుతున్నాయి. మరో ప్రాంతంలోని మసాజ్ సెంటర్ నుంచి బెడ్డుకు రూ.5 వేల చొప్పున కమీషన్ వస్తుంది. ఎన్ని పడకలు ఉంటే దాని ప్రకారం రూ.5 వేలు ముట్టజెప్పాల్సిందేనని హుకుం జారీ చేశాడు ఆ ఇన్‌స్పెక్టర్.
తాము అంత ఇచ్చుకోలేమని మొత్తుకున్నా.. ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఓ నిర్వాహకుడు వాపోయాడు. గతంలో ఎస్‌వోటీ పోలీసుల్లో కొందరు మసాజ్ సెంటర్ల నుంచి వసూళ్లకు పాల్పడేవారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో అక్కడితో వసూళ్ల దందా ఆగిపోయింది.
వ్యభిచారం ముఠాపై సైబారాబాద్ పోలీసుల ఉక్కుపాదం : ఇదే సమయంలో గతేడాది 14,190 మంది యువతుల్ని వ్యభిచార కూపంలోకి దింపిన అంతర్జాతీయ వ్యభిచార ముఠాను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ముఠాతో లింకులున్న వ్యభిచార గృహాల నిర్వాహకులు, మసాజ్ సెంటర్ల యజమానులపై వరుస దాడులతో కఠిన చర్యలకు దిగారు. దీంతో అడ్డదారులు తొక్కే ఇతర మసాజ్ సెంటర్ల నిర్వాహకుల్లో భయం మొదలైంది. ఇదే అదనుగా సదరు అధికారి తనకు అడిగినంత ఇవ్వకపోతే తనిఖీలు చేసి వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
Police Raids on Spa Centres : మరోవైపు మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి.. ఇటీవల ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి.. యువతులను రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు 18 మంది విటులను కోర్టులో హాజరుపరిచారు.
ఇవీ చదంవడి: