ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని చెరువుల్లోకిగా భారీగా వరదనీరు పొటెత్తుతోంది. ఆ చెరువులకు తూములు లేకపోవడం వల్ల లోతట్టు కాలనీల్లోకి పెద్దమొత్తంలో వరదనీరు వచ్చి చేరుతోంది. రామంతపూర్ చెరువు పొంగిపొర్లడం వల్ల హబ్సిగూడలోని రవీంద్రనగర్, సాయిచిత్రానగర్, లక్ష్మీనగర్ సహా పలు కాలనీలను నీరు చుట్టుముట్టింది. కాలనీల నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలోనే మూడుసార్లు కాలనీని వరద చుట్టుముట్టిందన్న స్థానికులు.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
వరద గుప్పిట్లోనే..
సరూర్‌నగర్‌లోని వివిధ కాలనీలు వరద గుప్పిట్లోనే కొనసాగుతున్నాయి. వానలతో సరస్వతినగర్, కోదండరాం నగర్, సింగరేణి కాలనీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
జలదిగ్బంధంలోనే కాలనీలు
భారీ వరదపోటుకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మోకాళ్ల లోతు నీళ్లలో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. వరద ముంపుతో పాతబస్తీ అల్ జుబైల్ కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి సామగ్రి నీటిలో కొట్టుకెళ్లాయి. కాలనీల చుట్టూ భారీగా చెత్త పేరుకుపోయింది. ఇళ్లలోకి చేరిన బురదను తొలగిస్తున్నారు.
తెరిచిన ఫాక్స్‌సాగర్ తూము
హైదరాబాద్ జీడిమెట్లలోని ఉమామహేశ్వర కాలనీ నీటిలోనే నానుతోంది. ఫాక్స్ సాగర్ చెరువు తూము తెరవడం వల్ల క్రమంగా నీరు బయటకు వెళుతోంది. ఫాక్స్‌సాగర్ చెరువు తూము తెరించేందుకు రెండ్రోజులపాటు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిపుణులు శ్రమించారు. ఎట్టకేలకు తూము తెరవడంతో ప్రస్తుతం కొంత మోతాదులో నీరు బయటకు వెళుతోంది. పూర్తిస్థాయిలో నీరు బయటకు వెళ్లేందుకు కొంత సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
కూలుతున్న పురాతన ఇళ్లు
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పురాతన పలు ఇళ్లు కూలుతున్నాయి. పాతబస్తీ కామాటీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లు కూలిన ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున ఇంటిపై కప్పు నుంచి మట్టిరాలడాన్ని గమనించిన వ్యక్తులు.. అప్రమత్తమై బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంనుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
ఇవీ చూడండి: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ఉత్తమ్