పట్టణ ప్రాంతాల్లో ప్రతి పదివేల జనాభాకు ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించాలనే ప్రణాళిక ఉందని రాష్ట్ర కార్యదర్శి కాచెం రమేశ్ తెలిపారు. అలాగే మండల స్థాయిలో రాష్ట్రీయ స్వయం సేవక్ శాఖలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. హైదరాబాద్ బర్కత్‌పురా కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరోనా సమయంలో చేపట్టిన ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు, రామమందిర్ నిధి సమర్పణ, అఖిల భారతీయ ప్రతినిధి సభ తదితర అంశాలను వివరించారు. కొవిడ్ కాలంలో 92 వేల కేంద్రాల ద్వారా ఆర్ఎస్ఎస్ సేవలు అందించిందన్నారు. రామమందిర్ నిధి సమర్పణకు తమ కార్యకర్తలు 68.59 లక్షల కుటుంబాలను కలిశారని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటం, కుటుంబ విలువలను పెంపొందించటం లాంటి అంశాలపై ప్రచారం నిర్వహిస్తామని కాచెం రమేశ్ తెలిపారు.