Indian Mining Day is celebrated: దేశ ఖనిజ సంపదను జాతి ప్రయోజనాల కోసం వెలికితీస్తున్న ఇంజినీర్లు నేడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (జీఎస్ఐటీఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. తద్వారా దేశం ఖనిజ వినియోగంలో స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి కార్యాలయంలో జరిగిన ఇండియన్ మైనింగ్ డే ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో ఖనిజ సంపద వెలికితీస్తున్న మైనింగ్ ఇంజినీర్లు బృహత్తరమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. కనీసం సౌకర్యాలు లేని అడవులు, కొండల ప్రాంతంలో ఇంజినీర్లు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమన్నారు.
నేడు పర్యావరణహిత మైనింగ్ పద్ధతులు అందుబాటులోకి వచ్చినందున పర్యావరణానికి, సమీప గ్రామాలకు హాని కలగని మేలైన పద్ధతులను పరిశ్రమల వారు పాటించాలని పేర్కొన్నారు. దీనికి మైనింగ్ ఇంజినీర్లు మేధావులు తగు విధంగా మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతీ సంవత్సరం ఇండియన్ మైనింగ్ డేని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపిన ఆయన.. హైదరాబాద్ ఎంఈఏఐ వారు దీనిని ఒక ఉత్సవంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈఏఐ సెక్రటరీ జనరల్ నర్సయ్య మాట్లాడుతూ.. గతంతో పోల్చితే నేడు మైనింగ్ ఇంజినీరింగ్లో రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ దిశగా యువ ఇంజినీర్లను చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్లపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శ్రీ ఫసియొద్దీన్, శ్రీ వి.ఎస్.రావులు, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శ్రీ రంగనాధీశ్వర్ పాల్గొని ప్రసగించారు.
దేశంలో అనేక పరిశ్రమల తో పాటు, రాష్ట్రంలో గల అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన సింగరేణిలో ఇంజనీర్ల కృషి అద్భుతమన్నారు సింగరేణి జనరల్ మేనేజర్ ఎం.సురేష్. సింగరేణి సాధిస్తున్న ప్రగతిలో వారి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ మైనింగ్ కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు.
ఇవీ చదవండి: