కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. కోలుకునేందుకు ఎంతకాలం పడుతుందో ఇప్పుడే అంచనావేయలేని పరిస్థితి నెలకొంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడం వల్ల అక్కడ ఉద్యోగం ఆపదలో పడింది. ప్రధానంగా హెచ్1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీల ఆర్థిక సమస్యలతో ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది స్పష్టత కొరవడింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు నిర్ణయిస్తే అక్కడ ఉండటం కూడా సమస్యగా మారుతుంది. భారత, అమెరికా ప్రభుత్వాలు పెద్ద మనసు చూపకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని నూజెర్సీలోని ప్రముఖ బ్యాంకులో పని చేస్తున్న పర్వతనేని రమేశ్ కుమార్ ‘పేర్కొన్నారు. ‘ప్రత్యేకించి ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సద్దుమణిగిన తరువాతే వాస్తవ పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. ఇతర వీసాలపై అమెరికాలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో చాలా మంది ఇప్పటికే ఉపాధి కోల్పోయారు’’ అని వివరించారు.
అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉద్యోగం చేస్తూ, వీసా గడువు పొడిగింపు కోసం మాతృదేశం వచ్చిన వారు పెద్దసంఖ్యలోనే ఇక్కడ ఉండిపోయారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి అన్ని రకాల వీసా ప్రక్రియల జారీని నిరవధికంగా నిలిపివేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వీసా స్టాంపింగ్ కోసం రాయబార కార్యాలయంతోపాటు కాన్సుల్ కార్యాలయాల్లో ఎంతమంది వెయిటింగ్‌లో ఉన్నారనేది చెప్పటం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇక్కడ ఆగిపోయిన హెచ్1బీ వీసాదారుల్లో.. అమెరికా వెళ్లాక ఉద్యోగం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడి పరిస్థితిని కంపెనీకి వివరించటం వల్ల నెల రోజుల పాటు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి పని చేసేందుకు ఐబీఎం సంస్థ అనుమతించిందని దేవినేని ప్రదీప్‌చంద్ర పవన్ తెలిపారు. తాత్కాలికంగా హైదరాబాద్‌లోని ఐబీఎం బ్రాంచ్‌కు బదిలీ చేయాలని కోరగా.. కంపెనీ ఇంకా తన నిర్ణయం చెప్పలేదన్నారు.
3.5 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం!
కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత అన్ని స్థాయిల్లో కలిపి అమెరికాలో పని చేస్తున్న అన్ని దేశాలకు చెందిన వారిలో సుమారు 3.5 కోట్ల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీసా నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసాపై పని చేస్తున్న వారి ఉద్యోగ కాలం తీరిన తరువాత అమెరికాలో 60 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంది. ఆ తరువాత అక్రమ వలసదారుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటూ ఉపాధి కోల్పోయిన వారు, మరో ఉద్యోగం వెతుక్కునేందుకు లేక మాతృదేశానికి వెళ్లేందుకు ఉన్న గడువును 60 నుంచి 180 రోజులకు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడికి పంపిన ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటికే 80 వేల మంది సంతకాలు చేసినట్లు సమాచారం. కనీసం లక్ష మంది సంతకాలు చేస్తే కానీ అమెరికా శ్వేతసౌధం ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోదు. శుక్రవారానికి లక్ష లక్ష్యం పూర్తవుతుందని అంచనా. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: కరోనా చికిత్స కోసం రూ. 370 కోట్లు విడుదల