Independents MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఆరింటిని అధికార తెరాస ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగతా ఆరుచోట్ల ఎన్నికలు జరిగాయి. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మరికొన్ని చోట్ల పార్టీకి చెందిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. మెదక్‌లో జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డిని పోటీ చేయగా.. 238 ఓట్లు వచ్చాయి. 230 ఓట్ల కంటే తగ్గితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. మాట నిలబెట్టుకున్నామని నైతిక విజయం తమదేనని జగ్గారెడ్డి సతీమణి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉందంటేనే ఓటర్లకు కవర్లు వచ్చాయి. వారికి విలువ దక్కింది. 230 ఓట్లు వస్తే మేం నెగ్గినట్లేనని మొదటి నుంచి అనుకున్నాం. మేం 238 ఓట్లు సాధించాం. కాబట్టి ఈరోజు మాది కూడా విజయమే.
-నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి
కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు!
ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు 242 ఓట్లు రాబట్టగలిగారు. క్రాస్ ఓటింగ్‌పై సమీక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. పార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్‌కు 142 మంది ఓట్లు వేయడం తెరాసలో చర్చనీయాంశంగా మారింది. తెరాసకు 541 ఓట్లు ఉన్నాయని స్వయంగా ప్రకటించగా.. 480 ఓట్లు మాత్రమే రావడంతో క్రాస్ ఓటింగ్ బహిర్గతమైంది.
తెరాసకు 541 ఓట్లు ఉన్న మాట వాస్తవం. కానీ 480 ఓట్లు వచ్చాయి. దీనిమీద పార్టీలో చర్చిస్తాం. ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎందుకు జరిగాయో చర్చిస్తాం. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మేమంతా నడుచుకుంటాం.
-తాత మధు, గెలిచిన తెరాస అభ్యర్థి
రవీందర్ సింగ్ ఎఫెక్ట్
కరీంనగర్‌లో తెరాసను వీడిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఇండిపెండెంట్‌గా పోటీచేసి చెప్పుకోదగ్గ ఓట్లనే రాబట్టగలిగారు. తనకు ఒక్క ఓటు కూడా రాదన్నారని.. 232 ఓట్లు సాధించానని తెలిపారు. ప్రజాప్రతినిధులను క్యాంపులకు తీసుకెళ్లడం.. ఇతర ప్రయోజనాలన్నీ తాను పోటీలో ఉండటం వల్లే జరిగాయన్నారు. తెరాస అభ్యర్థులు భాను ప్రసాద్.. రమణకు వచ్చిన ఓట్లలో తేడాలు ఆ పార్టీలో బీసీ పట్ల ఉన్న వైఖరిని తెలియజేస్తున్నాయని రవీందర్‌సింగ్ వ్యాఖ్యానించారు.
'ఫోన్ చేసి మరీ వద్దన్నారు..'
ఆలేరు మాజీ ఎమ్మెల్యే నగేశ్ నల్గొండ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా మంచి ఓట్లనే రాబట్టగలిగారు. కాంగ్రెస్ నేతలు తన విజయానికి సహకరించలేదని ఆరోపించిన నగేశ్.. కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ తనకు ఓటు వేయవద్దని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెల్లని ఓట్లు
స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్నిచోట్ల భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నల్గొండ స్థానంలోనూ 50 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ఖమ్మంలో -12, మెదక్‌లో 12 మంది ప్రజాప్రతినిధులు వేసిన ఓట్లు ఉపయోగం లేకుండా పోయాయి.
ఇదీ చదవండి: TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం