Independence Diamond Jubilee Closing Ceremony at HICC : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు(Swatantra Bharata Vajrotsavaalu) నేటితో ముగిశాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ(HICC)లో జరిగిన ముగింపు వేడుకల్లో ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐసీసీ ముందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షించారు.
CM KCR Participated Independence Diamond Jubilee Closing Ceremony : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రప్రభుత్వం గతేడాది నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రారంభ వేడుకలను 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం' పేరిట గత సంవత్సరం ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రారంభ వేడుకలూ ఇక్కడే..: 2022 ఆగస్టు 8న హెచ్ఐసీసీ వేదికగానే వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫ్రీడం కప్ పేరిట ఫ్రీడమ్ రన్, ప్రత్యేక ర్యాలీలు, ఆటల పోటీలు, రాష్ట్రమంతటా ఏకకాలంలో ఎక్కడివాళ్లు అక్కడ 'తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన' నిర్వహించారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని రెండు దఫాలుగా ఉచితంగా ప్రదర్శించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్
Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony at HICC : ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి.. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి.. ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా రంగాల్లో ఉత్తమ పని తీరును కనబరచిన వారిని గుర్తించి అవార్డులు అందించారు. నేడు జరిగిన ముగింపు వేడుకలతో వజ్రోత్సవాలు సుసంపన్నం అయ్యాయి.
ఒకే రోజు కోటి మొక్కలు..: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటారు. ఇది స్వతంత్ర వజ్రోత్సవాలకు తెలంగాణ ఇచ్చే కానుకగా వర్ణించారు.