గాంధీ ఆసుపత్రిలో సాధారణ ఓపీ సేవలు నిలిచిపోవడం వల్ల ఉస్మానియా జనరల్ ఆసుపత్రిపై తాకిడి పెరిగింది. సాధారణం కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో రోగులు క్యూ కడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లతో వస్తున్న రోగుల సంఖ్య పెరగినందున.. అదనపు సిబ్బంది కావాలని జనరల్ మెడిసిన్ పీజీ వైద్య విద్యార్థులు శనివారం నుంచి విధులు బహిష్కరించారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఇబ్బందులు కలగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు వైద్యవిద్య సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే జనరల్ సర్జరీ నుంచి 16 మందిని, డెర్మటాలజీ నుంచి 21 మందిని, అనిస్థిషియా నుంచి ముగ్గురిని, పాథాలజీ నుంచి ముగ్గురిని జనరల్ మెడిసిన్ విభాగంలో సేవలందించడానికి తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విభాగంలో సేవలే కీలకం కావడం వల్ల అవసరమైన మేరకు ఎంబీబీఎస్ వైద్యులను కూడా ఇక్కడ సమకూర్చడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యవిద్య సంచాలకులు చెప్పారు.
"ప్రస్తుతమున్న ప్రాణవాయువు పైపులైన్లకు తోడుగా 40 కొత్త పైపులైన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మరో 500 పడకలకు కూడా ప్రాణవాయువును అందించేందుకు ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆక్సిజన్ పైపులైన్లు ఏర్పాటు చేయలేని పడకల కోసం 200 ప్రాణవాయువు సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థులు ఆందోళనను విరమించి, వెంటనే విధుల్లోకి చేరాలి’’ అని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి కోరారు.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన