గత రెండేళ్లలో వ్యవసాయానికి ఏకంగా 45శాతం కరెంట్ వినియోగం పెరిగినట్లు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అంతర్గత అధ్యయనంలో గుర్తించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లోని మొత్తం 10 పంట సీజన్లలో వరి పంట సాగు విస్తీర్ణం ఎంత..? దిగుబడులెంత పెరిగాయి..? తదితర వివరాలను ఆశాఖ అధికారులు పోల్చిచూశారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించిన తర్వాత వార్షిక వినియోగం 6,460 ఎంయూలు అదనంగా పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. వ్యవసాయ బోర్లకు అధిక వినియోగం ఉంటోంది. ఈ ఏడాది ఇంకా విద్యుత్ వినియోగం పెరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఎంత పెరిగినా.. రైతులకు అవసరమైనంత కరెంట్‌ను సరఫరా చేసేందుకు పక్కాగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఎక్కడెక్కడ విద్యుత్ వినియోగం పెరుగుతుందనేది శాస్త్రీయంగా పరిశీలించి సరఫరా చేయాలని డిస్కంలకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. గడిచిన మూడేళ్లలో 2016-17లో 14,374 ఎంయూలు, 2017-18లో 18,241 ఎంయూలు, 2018-19లో 20,834 ఎంయూలు విద్యుత్ పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.