ఏపీలోని విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. 3 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో మన్యం వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి వేళలో చలి నుంచి ఉపశమనం కోసం మంటలు వేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనంలో వెళ్లే వారు సైతం.. చలిని తట్టుకోలేక దిగి పక్కనే ఉన్న చలిమంటల వద్ద ఊరట పొందుతున్నారు.
చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రత తట్టుకోలేక బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు. లంబసింగిలో 4, చింతపల్లి మినుములూరులో 6, పాడేరులో 7 డిగ్రీల వరకు కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగైదు రోజులు నైరుతి గాలుల వల్ల చలి ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణం శాఖ వెల్లడించింది. చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఈ కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.