కాంగ్రెస్ నేతలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. నియోజకవర్గాల్లో కొవిడ్ నిర్ధరణ పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంత్రికి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోజువారీగా కొవిడ్ టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచాలని మంత్రికి సూచించారు.
ప్రజారోగ్యం గాలికి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కరోనా రోగులకు కనీస చికిత్స కూడా ప్రభుత్వం అందించట్లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని కలుస్తామంటే సమయం ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నిర్వాకం వల్లే ఉస్మానియా ఆస్పత్రి నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఆరోగ్యశ్రీలో చేర్చాలి..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల పడకలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు ప్రజల్లో ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారో చెప్పాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఒక వైద్యుడు ట్రాక్టర్ నడుపుతూ శవాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైరస్ పట్ల ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా ప్రభుత్వం మనోధైర్యం నింపాలన్నారు.
మజ్లిస్ సభ్యులు సైతం..
మరోవైపు మజ్లీస్ శాసనసభ్యులు సైతం మంత్రి రాజేందర్‌ను కలిసి ప్రతి కేంద్రంలోనూ రోజుకు వెయ్యి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కోరారు.
ఇవీ చూడండి : ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్