IT Raids in EXEL Group Companies: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు అలజడి రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు కలకలంరేపాయి. 20 బృందాలుగా ఏర్పడిన 60మంది ఐటీ అధికారులు.. ఏకకాలంలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎక్సెల్ గ్రూప్‌తో పాటు అనుబంధ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఎక్సెల్ గ్రూప్ నడుపుతోంది.
అలాగే... బాచుపల్లి, చందానగర్, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్‌లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ సోదాలు జరుగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఎక్సెల్ గ్రూప్‌కు చెందిన 5 చోట్ల ఐటీ సోదాలు జరుపుతుంది. కంది మం. చేర్యాల, జుల్కల్‌లోని 2 ఎక్సెల్ యూనిట్లలో సోదాలు చేస్తున్నారు. ఎక్సెల్ అనుబంధ సంస్థ ఏసీఈ టైర్ల పరిశ్రమలో తనిఖీలు చేపడుతున్నారు. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో ఎక్సెల్ రబ్బర్, విలాస్ పొలిమేరాస్ కంపెనీల్లోనూ ఐటీ అధికారులు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే బొల్లారంలోని ఎక్సెల్ పరిశ్రమలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే పరిశ్రమలలో దస్త్రాల్లో ఇతర వివరాలు సేకరించేందుకు పూర్తిస్థాయిలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పరిశ్రమ లోపలికి ఎవరినీ రానివ్వకుండా గేటువద్దే నిలిపివేస్తున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: