hyderabad traffic police: రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా హెల్మెట్ ధారణపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫొటోలు తీస్తూ చలాన్లతో వాహనదారులకు బుద్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లోనే 4లక్షల58 వేల కేసులు నమోదయ్యాయంటే హెల్మెట్ ధారణను పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో తెలుస్తోంది. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి మరీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిని పట్టుకుని చలాన్‌లు విధిస్తున్నారు.
వారికి రెండుసార్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వాహనదారులు మాత్రం కాలనీలోనూ ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటికి దగ్గర్లో దుకాణాలకు వెళ్లినపుడూ జరిమానా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరిశీలన చేసిన ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొద్దిరోజుల పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ-చలాన్‌ల జారీని తగ్గించాలని నిర్ణయించారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే.. కాలనీలు, గల్లీలు, అనుసంధాన రహదారుల్లో శిరస్త్రానం ధరించనివారిపై కేసులు పెట్టకుండా చర్యలు తీసుకునేలా ఆలోచిస్తున్నారు.
ఇదీ చదవండి: Puvvada On Revanth: 'నిరూపించకపోతే రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి'