రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యకు అనిశా కస్టడీ ముగిసింది. వారిద్దరినీ రెండు రోజుల కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరి దగ్గర లంచాలు స్వీకరించారు అనే కోణంలో ప్రశ్నించారు.
దర్యాప్తునకు సహకరించని లావణ్య
మొదటి రోజు ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయిన లావణ్య రెండో రోజు మాత్రం ఏం అడిగినా తెలియదు, గుర్తులేదు వంటి జవాబులు చెప్పటం వల్ల అధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. అయితే కొందుర్గు వీఆర్వో అనంతయ్య మాత్రం ఆమె అక్రమాల చిట్టా విప్పినట్టు తెలుస్తోంది. ఏదైనా పనిమీద తహసీల్దార్ కార్యాలయానికి వస్తే వదిలిపెట్టకుండా ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసేదని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.
రూ. 93 లక్షలు ఎక్కడివీ?
సోదాల సమయంలో లావణ్య నివాసంలో 93 లక్షల రూపాయలు గుర్తించారు. వీటితో పాటు ఆమె తండ్రి, ఇతర బంధువుల ఖాతాల్లో గుర్తించిన మరో 30 లక్షల రూపాయల ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించి లావణ్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. కస్టడీ ముగిసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి తిరిగి లావణ్య, అనంతయ్యలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: 'కజకిస్థాన్ ప్రెసిడెంట్స్ కప్'లో శివ థాపకు స్వర్ణం