తెలంగాణలో దళితబంధు మాదిరిగా గిరిజన, బీసీ, ఎంబీసీ, మైనారిటీ, బ్రాహ్మణ ఇతర అగ్రవర్ణ పేదలకు సైతం ‘బంధు’ పథకం తెస్తామని, ప్రాధాన్యక్రమంలో దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని, అదే పంథాలో నడుస్తున్నామన్నారు. ప్రజల అభిమానంతో రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్ల పాటు తెరాసయే అధికారంలో ఉంటుందని, పార్టీ పథకాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం నిర్వహించిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ప్రధానకార్యదర్శి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... దళిత బంధుపై పార్టీ శ్రేణులు ఊరూరా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టాలని, అడ్డగోలుగా మాట్లాడితే సహించవద్దని పిలుపునిచ్చారు. పార్టీలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలన్నారు. నాయకులను ప్రజలు ఎప్పటికప్పుడు కనిపెడుతుంటారని, అభిమానం లేకపోతే ఓడించడానికి వెనుకాడరని అన్నారు. వారికి నిత్యం అందుబాటులో ఉంటూ ఆదరాభిమానాలు పొందాలన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు సీఎం పలు అంశాలపై ఈ విధంగా మాట్లాడారు. ‘ఆవిర్భవించిన అనతికాలంలోనే దేశంలోనే అన్ని రంగాల్లో ముందున్న ఘనత తెలంగాణది. హరీశ్‌రావు నిన్ననే గణాంకాలు సహా ప్రగతిని కళ్లకు కట్టినట్లు వివరించారు. సాధించుకున్న తెలంగాణను అనుకున్న విధంగానే ముందుకు నడిపిస్తున్నాం. మన వల్లనే అది సాధ్యమైంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగుతోంది’.
ప్రజాక్షేత్రంలో...
ప్రజాక్షేత్రంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మన వనరులు ఎంతో బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇన్ని ఉన్నా గెలవకపోవడం స్వయంకృతాపరాధమే అవుతుంది. 2018 ఎన్నికల్లో మనం కచ్చితంగా 93 స్థానాలు గెలవాల్సి ఉంది. కానీ తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, మధుసూదనాచారి, జలగం వెంకట్రావు వంటి వారు అనూహ్యంగా ఓడిపోయారు. మరోసారి ఇలాంటివి జరగవద్దు. అన్ని సామాజికవర్గాలతో పాటు యువతకు పదవుల్లో ప్రాధాన్యమిస్తున్నాం. పార్టీ కమిటీల్లోనూ కొత్తవారికి... ఎక్కువగా యువతకు అవకాశమివ్వాలి. జిల్లా కమిటీలను మొదట్లో వద్దనుకున్నా, ఇప్పుడు జిల్లా కార్యాలయాలను నిర్మించినందున కమిటీలను నియమించాలని నిర్ణయించాం. తెలంగాణలో దళితబంధు అమలును చూసి దేశవ్యాప్తంగా దీన్ని తేవాలనే డిమాండు బలంగా రానుంది. ఈ పథకం మనకు ప్రతిష్ఠాత్మకం. దీని కోసం అంతా శ్రమించాలి. దీన్ని తమకూ అమలు చేయాలని మిగిలిన వర్గాల పేదలు కోరుతున్నారు. ఇది న్యాయమైన డిమాండు. వారికి న్యాయం చేద్దాం.
ఒకటో తేదీనే దిల్లీకి రావాలి
దిల్లీలో తెరాస కార్యాలయ భవన నిర్మాణానికి సెప్టెంబరు 2న భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. దీని కోసం ఒకటో తేదీనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ నేతలు రావాలి. వారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి: కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కమిటీ భేటీ