దేశంలో మిక్సోపతి వైద్య విధానం అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి వైద్యాలను సమన్వయపరుస్తూ కేంద్రం తెచ్చిన మిక్సోపతి విధానంతో వైద్యరంగానికి పెనుప్రమాదం ఏర్పడుతుందని వైద్య సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన కొనసాగిస్తోంది.
ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు కోఠిలోని ఐఎంఏ భవనంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఎనిమిదో రోజు ఐఎంఏ ఎయిర్ పోర్ట్ శాఖ వైద్యులు ఈ దీక్షలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేస్తున్నట్లు వైద్య సంఘాల నాయకులు తెలిపారు.
ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి డాక్టర్లు 56 రకాల శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్రప్రభుత్వం ప్రకటించగా... ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు వైద్య సంఘాల నాయకులు తెలిపారు. వెనక్కు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి గడువు పెంపు'