Kuntluru Peddacheruvu: వందేళ్ల చరిత్ర గల ఆ చెరువుపై కబ్జాదారుల కన్నుపడింది. అందులోని దాదాపు 43.81 ఎకరాలు కొన్నేళ్లుగా వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు చెరువు చుట్టూ ఉన్న ఎఫ్‌టీఎల్ బఫర్‌జోన్‌లోని భూములనూ బండరాళ్లతో నింపేస్తూ చెరువును దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. మరి కొందరు ఒక అడుగు ముందుకేసి చెరువులో నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పైభాగం నుంచి చెరువులోకి వచ్చే కాలువను బండరాళ్లతో పూడ్చి పని మొదలుపెట్టారు.
ఇదే పూర్తయితే చెరువులోకి చుక్క నీరు కూడా రాదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగర శివారు పెద్ద అంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని కుంట్లూరు పెద్ద చెరువు పరిస్థితి ఇది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రికార్డుల ప్రకారం కుంట్లూరు పెద్ద చెరువు 95.02 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది.
కొన్నేళ్ల కిందట ఈ చెరువు కింద వందల ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు చేయడం మానేశారు. దీంతో మత్స్యకార సంఘం చెరువులో చేపల పెంపకం మొదలుపెట్టింది. అనేక మంది మత్స్యకారులు దీనిని ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా అటు సాగునీటి శాఖ.. ఇటు రెవెన్యూ అధికారులు చెరువు గురించి పట్టించుకోకపోవడంతో చెరువుపై ఆక్రమణదారుల కన్ను పడింది.
సగం చెరువును పట్టా భూమిగా మార్చేసి..: చెరువులో నీటి ప్రవాహం తగ్గిన తరువాత కొందరు సాగు చేయడం మొదలుపెట్టారు. అధికారులు ఆ వైపు చూడకపోవడంతో అలా.. 43.8 ఎకరాలను నెమ్మదిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు తమకు అనుకూలంగా మొత్తం భూమిని పట్టా భూమిగా మార్చుకున్నారు. ఇప్పుడు చెరువు కేవలం 51.21 ఎకరాల విస్తీర్ణానికే పరిమితమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువులోకి నీటి ప్రవాహన్ని అడ్డుకునేలా ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు. కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. బఫర్ జోన్‌లో కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
వరద చేరకుండా కల్వర్టులను మూసేసి..: స్థానికంగా పేరున్న కొందరు బడా నాయకులు.. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో పెద్ద బండరాళ్లు తీసుకొచ్చి పూడ్చేస్తున్నారు. ఓ రసాయన కంపెనీలోని మట్టి తీసుకొచ్చి నింపేస్తున్నారు. ఈ మట్టితో చెరువులోని చేపలు చచ్చిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగోల్-పెద్ద అంబర్‌పేట్ రోడ్డులో చెరువులోకి వరద నీరు వెళ్లే కల్వర్టును సైతం రాళ్లతో కప్పేస్తున్నారు.
జేసీబీతో పెద్దఎత్తున పనులు చేపట్టి హయత్‌నగర్ పరిధి భాగ్యలత కాలనీ, హైకోర్టు కాలనీ, లెక్చరర్ కాలనీ మీదుగా హాతీగూడ చెరువు నుంచి కుంట్లూర్ పెద్ద చెరువులోకి వెళ్లే కల్వర్టులను మూసేసి.. వరద నీరు వెళ్లేందుకు వీలులేకుండా చేస్తున్నారు. దీంతో చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు స్పందించి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధులను గుర్తించే హద్దులను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కబ్జా తంతుపై మత్స్యకార సంఘం ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని మత్స్యకారులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువునే నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
TSRTCలో ఇకపై 'డైనమిక్' బాదుడు.. ఈ నెల 27 నుంచే ఆ మార్గాల్లో..
రాష్ట్రంలో రానున్న 5రోజులు వడగళ్లతో కూడిన వర్షాలు..
సామ్ 'శాకుంతలం' కోసం అంత బంగారం వాడారా.. వామ్మో ఎన్ని కోట్లో?