చెరువు శిఖం భూములు.. బఫర్ జోన్ ప్రాంతం... నీటినిల్వ ప్రాంతాలే కాదు.. అలుగులు సైతం ఆక్రమణకు గురయ్యాయి(illegal occupation of Pond). కొందరు అక్రమార్కులు అలుగులను కబ్జా చేసి భారీ భవంతులు(illegal constructions in pond lands) నిర్మించి వరదనీరు పారే దారి లేకుండా చేశారు. దీంతో చెరువులు నిండి అలుగు పారే మార్గం లేక సమీప కాలనీలను ముంచెత్తుతోంది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు పడితే కాలనీలలో ముంపు సమస్య ఏర్పడుతోంది. గ్రేటర్ పరిధిలో 185 తటాకాలు ఉండగా.. శివారు మున్సిపాలిటీల్లో మరో 111 చెరువులు ఉన్నాయి. ఇప్పటికే చెరువులకు సంబంధించి ఎఫ్‌టీఎల్ భూములు చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. ఏకంగా కొందరు ప్రజాప్రతినిధులే అలుగులను ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టారు. అటు నీటి పారుదల శాఖాధికారులు.. ఇటు రెవెన్యూ యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
- శంషాబాద్‌లోని కామునిచెరువు 52 ఎకరాల్లో విస్తరించి ఉంది. బెంగళూరు జాతీయ రహదారి పక్కనే విమానాశ్రయ అప్రోచ్ రోడ్డు వద్ద అలుగు ఉంది. 200 మీటర్ల మేర జాతీయ రహదారి పక్కనే పారుతోంది. అక్కడి రాళ్లగూడలోని జోష్‌కుంట.. అక్కడి నుంచి హిమాయత్‌సాగర్ వస్తాయి. అలుగు ప్రాంతాన్ని పూర్తిగా పూడ్చివేశారు. రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి ఏకంగా వాణిజ్య సముదాయం నిర్మించారు. కింది నుంచి పైపులైను వేసి అలుగు మళ్లించారు. ఇక్కడే ఉన్న ఫిరంగినాలా స్వరూపాన్నే మార్చివేశారు.
![](https://assets.eenadu.net/article_img/e_1.jpg)
- సూరారంలోని లింగం చెరువు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న తటాకం అలుగును పూడ్చివేశారు. కల్వర్టును మూసివేసి ఏకంగా ఓ ప్రజాప్రతినిధి భారీ నిర్మాణాలు చేపట్టారు. నీరు వెళ్లే దారి లేకుండా పోయింది. చెరువును వరద ఏటా ముంచెత్తుతోంది. ప్రత్యేకంగా మోటార్లు పెట్టి తోడించాల్సిన పరిస్థితి.
కట్ట వెడల్పుతో సరి..
సుందరీకరణ పేరిట ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా కట్ట వెడల్పు చేయడం, మురుగు చేరకుండా చర్యలు చేపట్టడం, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారు. కానీ చెరువు అలుగు పాడైతే తిరిగి పునరుద్ధరించే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అలుగు పారిన నీరు వరదకాల్వ నుంచి మరో చెరువులోకి వెళ్లే మార్గాలు కుంచించుకుపోయినా.. తిరిగి పునరుద్ధరించడం లేదు. దీంతో చెరువులలో చేరే నీరు ఎటూ పారే దారి లేకుండా పోయి కాలనీల్లోకి చేరుతోంది.
![](https://assets.eenadu.net/article_img/f_7.jpg)
ఇదీ పరిస్థితి..
- బండ్లగూడలోని సూరంచెరువు అలుగు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఇక్కడ భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. అలుగు పూడ్చివేసి.. వరదకాల్వ దారి మళ్లించారు.
- శంషాబాద్ సిద్ధాంతి బస్టాపు సమీపంలోని ఊరచెరువు కట్ట మీద నుంచి జాతీయ రహదారి నిర్మించారు. అలుగును పూర్తిగా ధ్వంసం చేశారు. కల్వర్టు ఎత్తు పెంచి నిర్మించడంతో.. ఎఫ్‌టీఎల్ పెరిగి శ్మశానవాటిక మునిగిపోయింది.
- జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌సాగర్ అలుగుపారే కాల్వ ఆక్రమణకు గురైంది. తూము పారే ప్రాంతం సైతం కబ్జాల చెరలో చిక్కుకుంది.
- తుర్కయాంజల్ వద్ద మాసాబ్‌చెరువు అలుగు ఆక్రమణకు గురై నీరు పారే కాలువుల కుంచించుకుపోయాయి.
- గాజులరామారంలోని బంధం చెరువు అలుగు ధ్వంసమైంది. ఇక్కడ చిన్నపాటి గోదాములు నిర్మించారు. చింతల చెరువుదీ అదే పరిస్థితి.
- బండ్లగూడ చెరువు అలుగును మూసివేయడంతో చాలావరకు ఆనవాళ్లు లేకుండాపోయింది.
- హయత్‌నగర్ బాతుల చెరువు అలుగుకు అడ్డంగా ప్రైవేటు వ్యక్తులు ప్రహారి నిర్మించారు.
- రామంతాపూర్‌లోని పెద్ద, చిన్న చెరువు అలుగులు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రత్యేకంగా పైపులైను నిర్మించి మోటార్లతో నీటిని తోడుతున్నారు.
ఇవీ చదవండి: