గ్రేటర్ హైదరాబాద్ మహా నగరం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్లోని ఉస్మాన్ గంజ్ నాలా పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని పరిశీలించారు. నూతనంగా నాలాపై నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్ పనుల తీరును ఆరా తీశారు. ఇష్టానుసారంగా అక్రమకట్టడాలు నిర్మించారని.. తక్షణమే వాటిని కూల్చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆ సమయంలో నీరు నిలుస్తోంది..
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే వర్షాలు కురిసినప్పుడు నగరంలోని చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుందన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలోని ఓ వార్డులోనూ నీరు చేరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ప్రభుత్వం సీరియస్గా ఉంది..
అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని... ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. అబిడ్స్ నేతాజీ నగర్ కాలనీలో 12 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..