ఐఐటీ హైదరాబాద్ ఆది నుంచి పర్యావరణ హిత ఆవిష్కరణపై దృష్టిసారిస్తూ వస్తోంది. మానవాళికి మేలు చేసే అంశాల మీద ఇక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి. అదేమార్గంలో... పర్యావరణానికి ముప్పుగా మారిన పంట వ్యర్థాల కాల్చివేతను అరికట్టేలా... పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌత్రే బయో ఇటుకలు తయారుచేశారు. పంటవ్యర్థాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి.. వాటికి సున్నంతో కలిపి అచ్చుల్లో పోయడం ద్వారా ఈ ఇటుకలు తయారు చేశారు. వీటితో ఓ గది సైతం నిర్మించారు. దేశంలోనే మొట్టమొదటి బయో ఇటుకల నిర్మాణాన్ని.. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ప్రారంభించారు. భవిష్యత్‌లో ఇలాంటి మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ధర తక్కువ.. మన్నిక ఎక్కువ
మట్టి, సిమెంటు ఇటుకలతో పోలిస్తే... బయో ఇటుకల ధర చాలా తక్కువగా ఉంటుంది. రెండు మూడు రూపాయలకే అందించవచ్చని పరిశోధకుడు ప్రియబ్రత చెబుతున్నారు. అన్ని కాలాలకు అనుగుణంగా ఈ ఇటుకలు దృఢంగా ఉంటాయని పేర్కొన్నారు. వీటిని విరివిగా ఉపయోగించుకునేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు.
వ్యర్థాలను ఉపయోగంలోకి తెచ్చి..
పంటవ్యర్థాల కాల్చివేత పెద్ద సమస్యగా మారింది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ నిర్మాణాలకు ఉపయోగపడే వస్తువును తయారుచేయాలనేదే మా ప్రయత్నం. మట్టి ఇటుకలతో పోలిస్తే వీటి ధర 3రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఇటుకలు బయటి ఉష్ణోగ్రతలను 5-6డిగ్రీల వరకు తగ్గించగలవు. అగ్నిప్రమాదాలనూ నివారించగలవు. ఇంట్లో తేమ నిర్వహణలోనూ ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తాం.
-ప్రియబ్రత
ఇదీ చూడండి: IVF: మాతృత్వానికి మరో దారి... ఐఐటీహెచ్ ఆవిష్కరణతో మరింత సులభం