కరీంనగర్, వరంగల్ నగరాల్లో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందం హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌తో సమావేశమైంది. వరంగల్, కరీంనగర్లో కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాల ద్వారా బయోగ్యాస్, బయోమాన్యూర్లు ఉత్పత్తి చేసే విషయమై సమావేశంలో చర్చించారు.
వ్యర్థాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని.. బయోగ్యాస్, బయోమాన్యూర్ ఉత్పత్తితో ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఒక్కో ప్లాంటులో సుమారు 10 టన్నుల వరకు కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్, బయోమాన్యూర్ ఉత్పత్తి చేస్తారు. ఒక్కో ప్లాంట్‌కు రూ.5 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. స్మార్ట్ సిటీ నిధులతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ఈ విషయమై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కరీంనగర్, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన మాట్లాడారు.
ఇదీ చూడండి: సాగర్ ఉపపోరు: విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్