నిత్య పనిలో చాలా చురుకైన అమ్మాయి. ఏరి కోరి జాయినైన ఓ కంపెనీలో తానెంత కష్టపడినా, ఆ విషయం పైఅధికారులకు తెలిసినా ఉద్యోగంలో ఉన్నతి మాత్రం కరువైంది. దీంతో వేరే కంపెనీలో ఉద్యోగ వేట ఆరంభించిందామె.
ఆఫీస్ అంటే మన నైపుణ్యాలను పెంచుకుంటూ, కొలీగ్స్‌ని కలుపుకొనిపోతూ.. అంతిమంగా మన పనితనం కంపెనీకి ఉపయోగపడేలా ఉండాలి. మరి, అలాంటి వాతావరణం పలు కారణాల వల్ల విషపూరితమవుతుంది. దాని ప్రభావం మన పైనే కాదు.. కొన్నిసార్లు మన కెరీర్‌నీ దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే నచ్చని చోట పనిచేయడం కంటే.. ప్రత్యామ్నాయం వెతుక్కొని కెరీర్లో అభివృద్ధిని సాధించడం ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా మంచిదంటున్నారు. మరి, ఇంతకీ పని వాతావరణాన్ని నెగెటివ్‌గా ప్రభావితం చేసే ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి.
సహోద్యోగులపై అసూయపడే కొలీగ్స్, చేసే పనిపై కాకుండా ఆఫీస్ రాజకీయాలపై దృష్టి పెట్టే ఉద్యోగులు, కెరీర్లో ఉన్నతి లేకపోవడం, సెలవు తీసుకున్నా పనిచేయాల్సి రావడం, పైఅధికారుల ప్రోత్సాహం కరువవడం.. ఇలా ఇవన్నీ ఆఫీసుల్లో పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంటాయి. అంతేకాదు.. ఇవి ప్రత్యక్షంగానైనా/పరోక్షంగానైనా మన పనితనం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. అందుకే ఇలాంటి చోట పని చేయడం కంటే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
మిమ్మల్ని దూరం పెడుతున్నారా?
ఒక బృందం ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తోందంటే దానికి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి అప్డేట్ ఆ గ్రూప్‌లో ఉన్న అందరికీ తెలిస్తేనే కలిసికట్టుగా ముందుకెళ్లగలం.. అనుకున్న సమయానికి చక్కటి అవుట్‌పుట్‌ని కంపెనీకి సమర్పించచ్చు. అయితే బాగా పనిచేసే వాళ్లపై ఇతర కొలీగ్స్‌కి ఉండే అసూయ, సహోద్యోగుల మధ్య కమ్యూనికేషన్ లోపం, కలిసికట్టుగా కాకుండా గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి నచ్చినట్లుగా వారు పనిచేయడం.. వంటి అంశాలు పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి చోట మీరు పని చేస్తున్నా, చక్కటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా మిమ్మల్ని వేరు చేసి చూడడం, పనికి సంబంధించి మీకు ఎలాంటి అప్డేట్ చెప్పకపోవడం.. వంటి అంశాలు మీ వ్యక్తిగత పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఇది క్రమంగా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే అంతిమంగా మీ కెరీర్ ఉన్నతికి గండి పడ్డట్లే! కాబట్టి ఇలాంటి వాతావరణంలో పని చేస్తున్నప్పుడు మీ వెనక జరిగే గ్రూపిజం, ఆఫీస్ రాజకీయాల గురించి, మీ పనితీరు గురించి ముందుగా పైఅధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అయినా లాభం లేదనుకుంటే అందులోనే వేరే విభాగానికి మారడం లేదంటే వేరే ఉద్యోగం వెతుక్కోవడం వల్ల కెరీర్లో ముందుకెళ్లచ్చు. అయితే ఇక్కడ వారి కోసం నేనెందుకు నా ఉద్యోగం వదులుకోవాలి అన్న మొండి పట్టుదలను వీడడం మంచిదంటున్నారు నిపుణులు.
ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే!
నచ్చిన ఉద్యోగం వచ్చింది. ఇక నా పనితనమేంటో చూపిస్తా.. అంటూ ఎంతో ఉత్సాహంగా తాము కోరుకున్న జాబ్‌లో జాయినవుతుంటారు చాలామంది. అయితే అక్కడికెళ్లి కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేస్తే గానీ తెలియదు ఆ కంపెనీ పని వాతావరణం గురించి! ఈ క్రమంలో ఎంత పని చేసినా సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, కొన్ని కంపెనీల్లోనైతే పనిచేసే వారికంటే చేయని వారికే అధిక ప్రాధాన్యమిస్తూ వారికే పైఅధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం.. వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి వాతావరణం ప్రత్యక్షంగా మనం చేసే పని పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంటుంది.
ఛ.. ఛ.. ఎంత పని చేసినా బూడిదలో పోసిన పన్నీరే! అన్న భావన మనకు కలిగేలా చేస్తుంది. నిజానికి ఆ ఫీలింగ్ వచ్చిందంటే అలాంటి చోట పని చేయలేమని అర్థం. అందుకే అక్కడే రోజులు గడిపేయడం కాకుండా సత్వరమే వేరే ఉద్యోగంలోకి మారిపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆ సమయాన్ని వేరే కంపెనీలో మనం కెరీర్లో ఉన్నతి సాధించడానికి వినియోగించుకోవచ్చు.
పని భారమంతా మీదేనా?
మనం చేసే ఉద్యోగమేదైనా సరే.. మనకు అప్పగించిన పనికే పరిమితం కాకుండా.. ఫలానా పనిని నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసంతో, యాక్టివ్‌గా ఆ పనిని స్వీకరించాలి. ఈ క్రమంలో మీలోని సృజనాత్మకతను చాటుకుంటే మరీ మంచిది. అయితే ఈ చురుకుదనం ఒక్కోసారి మన తలపై భారంగా మారే అవకాశాలూ లేకపోలేదు. ఎలాగూ ఈ అమ్మాయి యాక్టివ్‌గా పనిచేస్తుంది కదా అని కొంతమంది టీమ్ లీడర్స్/పైఅధికారులు సహోద్యోగుల పనిని కూడా వారి నెత్తినేస్తుంటారు.
దీనివల్ల మోయలేని భారం మీపై పడడంతో పాటు అంతిమంగా ఇది మీపై ఒత్తిడిని తీసుకొస్తుంది. తద్వారా మీరు చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. అందుకే ఇలా పని విషయంలో మీ తలకు మించిన భారం అనిపిస్తే ‘నో’ చెప్పడానికి వెనకాడకూడదని చెబుతున్నారు నిపుణులు. అయితే కొలీగ్ రానప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పనో, ఏవైనా అరుదైన సందర్భాల్లో అదనపు పనిని తీసుకోవడంలో తప్పులేదు. అంతేకానీ.. అదే నిత్యకృత్యం అయితే నిర్మొహమాటంగా నేను చేయనని చెప్పడం.. ఎంత చెప్పినా వినకుండా మీపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
సెలవు పెట్టినా పని.. పని.. పని..!
అసలే ఆఫీస్‌లో ఎడతెగని పని. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వచ్చిన దగ్గర్నుంచి కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్ర పోవడానికి కూడా సమయం ఉండట్లేదు చాలామందికి! పోనీ ఓ రోజు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుందామంటే అదీ కుదరట్లేదు. ఎలాగూ ఇంటి నుంచే పని కదా.. ఓ రెండు మూడు గంటలు వెచ్చించి ఈ పని పూర్తి చేయండి.. అన్న ఆర్డర్లు కొంతమంది ఉద్యోగులకు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి.
ఇక సెలవు రోజు కూడా ఇలా మొదలుపెట్టిన పని కాస్తా సాయంత్రానికి గానీ పూర్తవదు. దీంతో ఇటు విశ్రాంతి తీసుకున్నట్లు కాదు.. అటు పూర్తి రోజు పని చేసినట్లూ కాదు. ఫలితంగా చాలామంది ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ టెన్షన్ భరించలేక ప్రత్యామ్నాయ ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టే వారూ లేకపోలేదు. నిజానికి ఒత్తిడితో సతమతమయ్యే కంటే ఇదే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి పని వాతావరణంలో పనిచేసి కెరీర్లో అక్కడే ఆగిపోవడం కంటే.. ఒత్తిడి లేకుండా హాయిగా పనిచేసుకుంటూ ఉన్నతి సాధించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇవే కాదు.. సహోద్యోగులపై చేసే చెడు ప్రచారాలు, పనిచేసే చోట లైంగిక వేధింపులు.. వంటివి కూడా అటు పని వాతావరణాన్ని, ఇటు ఉద్యోగుల కెరీర్ ఉన్నతిని దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇలాంటి విషపూరిత వాతావరణానికి టాటా చెప్పి.. కొంచెం లేటైనా సరే సౌకర్యవంతంగా, అభివృద్ధి ఉన్న చోటికి రెక్కలు కట్టుకొని వాలిపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతున్నారు నిపుణులు.
ఇదీ చూడండి: ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి