దిల్లీలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని పుణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎలిసా ఆధారిత యాంటీబాడీ పరీక్ష కిట్లను రూపొందించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘కొవిడ్ కవచ్ ఎలిసా’ అని నామకరణం చేసింది. ముంబయిలో రెండు చోట్ల ఈ కిట్ల పనితీరును ధ్రువీకరించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ప్రమాణాలు, కచ్చితత్వం ఉన్నతంగా ఉన్నాయన్నారు. రెండున్నర గంటల్లో ఒకేసారి 90 నమూనాలను పరీక్షించగలగడం ఈ కిట్ల ప్రత్యేకత అని తెలిపారు. చౌక ధరల్లో, వేగంగా, ఒకేసారి భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుందన్నారు. ఏ స్థాయి ప్రజారోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లోనైనా ఈ పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. జిల్లా స్థాయిలో కూడా సులభంగా నిర్వహించవచ్చన్నారు.
ఈ కిట్లను భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జైడూస్ క్యాడిలా సంస్థకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కిట్ల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం జైడూస్ సంస్థకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలతో పోల్చుకుంటే వీటి నిర్వహణకు జీవభద్రత అవసరాలు (బయో సెక్యూరిటీ రిక్వైర్‌మెంట్స్) తక్కువేనని పేర్కొన్నారు. చైనా యాంటీబాడీ కిట్ల నాణ్యతలో లోపాలుండటంతో వాటిని ఐసీఎంఆర్ నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ కిట్లు అందుబాటులోకి రానున్నందున త్వరలో దేశవ్యాప్తంగా యాంటీబాడీ పరీక్షల నిర్వహణ ఊపందుకొనే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: దిల్లీలోనూ 'దొంగ కరోనా' కేసులు- 75% అవే!