హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృత్తమైన ఆకాశం.. సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా మ్యాన్‌హోళ్ల నుంచి పెద్దఎత్తును నీరు పొంగిపోర్లుతోంది. ట్రాఫిక్‌కి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మల్కాజిగిరిలో వడగండ్లు...
మల్కాజిగిరి, నేరెడ్ మేట్, కుషాయిగూడ, నాగారం, చర్లపల్లి, దమ్మాయిగూడాలో ఉరుములు, మెరుపులుతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లన్ని జలమయమయ్యి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
శేరిలింగంపల్లిలోనూ...
హైదరాబాద్ శేరి లింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన ఉరుములు మెరుపులతో జల్లులు కురిశాయి.
సికింద్రాబాద్‌లో భారీ వర్షం
సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి,అడ్డగుట్ట ,చిలకలగూడ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరవాసులు పులకరించిపోయారు. వేసవి ఎండల తీవ్రత నుంచి నగర వాసులకు కొంత ఉపశమనం లభించింది. ఉదయం నుంచే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉండగా... మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది.
జీడిమెట్లలోనూ వడగళ్ల వాన..
జీడిమెట్ల, సూరారం, బహదూర్ పల్లి, దుండిగల్, జగద్గిరి గుట్ట, గాజుల రామారం, సుచిత్ర, కొంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వడగండ్ల వాన కురిసింది. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. సురారం తెలుగు తల్లి నగర్లో డ్రైనేజీ పొంగి నీరు ఇళ్లలోకి చేరింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.