రోజు రోజుకీ పెరుగుతున్న పోటీని తట్టుకొని సమర్థవంతంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఆరు రకాల స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం 1163 ఖాళీలతో ఐబీపీఎస్ ప్రకటన వెలువరించింది. వీటిలో ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీలో ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ /జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి ఉద్యోగ పరీక్షలకు జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. మిగతా వాటికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఇస్తారు. మెయిన్స్ పరీక్షలో రాజ్యభాష అధికారి మినహా మిగతా వారికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి.
ఎలా సన్నద్ధం కావాలి...?
ఐబీపీఎస్ పీఓ, క్లర్క్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇతరులు మాత్రం అన్ని విభాగాలను చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లోని నాలుగు సబ్జెక్టులకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. ప్రాథమిక పరీక్షకు దాదాపు 50 రోజులు ఉంది.
ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్
పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్‌లకు ప్రాధాన్యం ఇచ్చి, తర్వాత తక్కువ మార్కుల అంశాలను చూసుకోవాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, రీజనింగ్‌లో బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, కోడింగ్-డీకోడింగ్, సిలాగిజమ్, లెటర్, నంబర్ సిరీస్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, ఇంగ్లిష్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్, సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మొదలైన వాటి నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. ముందుగా వీటిపై దృష్టి పెడితే మంచిది.
రోజూ ఒక మోడల్ పేపర్
అన్ని టాపిక్‌ల అధ్యయనం పూర్తయినా కాకపోయినా రోజూ ఒక మోడల్ పేపర్‌ను ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల నిర్దేశిత సమయంలో ప్రశ్నలు పూర్తి చేయడం అలవాటవుతుంది. ఎలాంటి ప్రశ్నలు చేయాలో ఏవి వదిలేయాలో అర్థమవుతుంది.
ప్రొఫెషనల్ నాలెడ్జ్ కీలకం
మెయిన్స్ పరీక్షలోని ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం ఈ పరీక్షలో చాలా కీలకమైంది. ఈ సబ్జెక్టును అభ్యర్థులు డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చదివే ఉంటారు. కొద్దిగా శ్రమిస్తే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్స్‌లో ఉండే సబ్జెక్టే అయినప్పటికీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ రాయడానికి ప్లాన్ చేసుకోవాలి. మూడు నెలలు బాగా కష్టపడితే బ్యాంక్ ఉద్యోగం సొంతమవుతుంది.
అర్హత
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. దరఖాస్తుకు చివరితేది: 26.11.2019.* ప్రిలిమినరీ పరీక్షతేది: డిసెంబరు 28, 29.
మెయిన్స్ పరీక్షతేది: 25.01.2020. వెబ్‌సైట్: https://www.ibps.in/
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు