IAS TRANSFERS: ఐఏఎస్ అధికారుల బదిలీలు మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైన నేపథ్యంలో సమావేశాల తర్వాతే బదిలీలు ఉండవచ్చని అంటున్నారు. అయితే కీలకమైన రెవెన్యూశాఖ సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి మాత్రం త్వరలోనే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఐఏఎస్ అధికారుల బదిలీ అంశం గత కొన్నాళ్లుగా పదేపదే వినిపిస్తోంది. చాలా కాలం నుంచి బదిలీలు జరుగుతాయన్న ప్రచారం సాగుతోంది. కొందరు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బదిలీల విషయమై కసరత్తు కూడా చేశారు. అయితే వివిధ కారణాల రీత్యా బదిలీలు వాయిదా పడుతూ వచ్చాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఉన్నందున అది పూర్తయ్యాకే బదిలీలు జరుగుతాయని అందరూ భావించారు.
ఓటర్ల తుది జాబితా ప్రకటించి కూడా దాదాపు 20 రోజులు కావస్తోంది. అయినప్పటికీ బదిలీలకు సంబంధించిన అంశం ఇంకా ముందు కదల్లేదు. అయితే హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు కూడా బదిలీలు ఆలస్యానికి కారణమైంది. ఐఏఎస్ అధికారుల బదిలీ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో దృష్టి సారించలేదని అంటున్నారు.
IAS TRANSFERS IN TELANGANA: వచ్చే మూడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ కసరత్తు కూడా వేగవంతమైంది.ఈ పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు ఇప్పుడు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. సమావేశాలు జరుగుతున్న తరుణంలో బదిలీల విషయమై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోవచ్చని.. సమావేశాలు ముగిశాకే చేపట్టవచ్చని భావిస్తున్నారు.
కీలకమైన కొన్ని శాఖలకు కార్యదర్శి పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి మాత్రం తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారని అంటున్నారు. సీఎస్‌గా ఉన్న సమయంలో సోమేశ్ కుమార్ రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులశాఖతో పాటు సీసీఎల్ఏ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఈ శాఖలన్నింటినీ ఇతరులకు అప్పగించాల్సి ఉంది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి మొన్నటి వరకు అటవీ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ బాధ్యతలను కూడా ఎవరికో ఒకరికి అప్పగించాల్సి ఉంది. కొందరు అధికారులు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు సంబంధించి కూడా సర్దుబాటు చేయాల్సి ఉంది. కొందరు అధికారులు పోస్టింగ్‌ల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. వారికి కూడా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి తాత్కాలిక సర్దుబాట్లతో అదనపు బాధ్యతలు అప్పగించి బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తిస్థాయి బదిలీలు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి: