పాలనను పరుగులు పెట్టించేందుకు వీలుగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సీఎస్‌గా ఉన్న ఎస్కేజోషి సహా కొందరు ఐఏఎస్ అధికారులు పదవీవిరమణ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల స్థాయిలో బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ వద్దే కీలకమైన రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్ సహా నీటిపారుదల శాఖలున్నాయి. మరికొన్ని శాఖలకు కూడా అధికారులు అదనపు బాధ్యతల్లో ఉన్నారు.
వచ్చే నెలలో బడ్జెట్..
సీఎస్‌గా సోమేశ్‌కుమార్ నియామకంతో కొన్ని మార్పులు అనివార్యమయ్యాయి. వాస్తవానికి సీఎస్‌గా సోమేశ్ నియామకంతో పాటే సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని అందరూ భావించారు. కానీ, పురపాలక ఎన్నికలు, రెండో విడత పల్లె ప్రగతి నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు చేయలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియడం వల్ల వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
కలెక్టర్ల బదిలీలు..?
ఐఏఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. కొన్ని జిల్లాల కలెక్టర్ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి కూడా కొంత మంది పాలనాధికారులు అక్కడే కొనసాగుతున్నారు. వారితో పాటు వివిధ కారణాల రీత్యా మరికొంత మంది కలెక్టర్లను కూడా బదిలీ చేయవచ్చని చెబుతున్నారు.
ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు కూడా చేపడతారని అంటున్నారు. బదిలీలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారని... త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం