హైదరాబాద్‌లో రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి తీరును, ఈ ఏడాది తొలి మూడు నెలల ప్రమాదాల గణాంకాలను పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల పరిశీలించారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. శిరస్త్రాణం ధరించకుండా బైక్‌లు నడుపుతున్న వారికి ట్రాఫిక్ పోలీసుల లఘు చిత్రాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడంతో ప్రమాదాల్లో 80శాతం మంది తీవ్రంగా గాయపడ్డారని.. వీరిలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు చెబుతున్నారు.
కోర్టుకు హాజరు కావాల్సిందే..
ద్విచక్రవాహనదారుల్లో కొందరు శిరస్త్రాణం ధరించకుండా.. మరికొందరు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఉల్లంఘనకు జరిమానాతోపాటు పాయింట్లు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో వాహన నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈ-కోర్టులకు హాజరు కావాలని స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అతివేగంగా వెళ్తున్న 36,565 మంది ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేశారు. కార్లు, ప్రైవేటు వాహనదారులు 30,930 మందికి ఈ-చలానాలు పంపించారు. మొత్తంగా 52 రోజుల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 7,62,919 మందిపై కేసులు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వారిని బేగంపేట, గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాలకు రావాలంటూ ఆదేశిస్తున్నారు.
ఇవీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరుస్తాం'