ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదాల్లో 22 మంది మరణిస్తే... వారిలో 12 మంది శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే తలకు తీవ్రగాయాలై మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ... శిరస్త్రాణం ధరించని వారిపై... జరిమానా విధిస్తున్నారు. అయినా... కొంతమంది మాత్రం శిరస్త్రాణం ధరించడం లేదు.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనంపై వెన్న ఓ వ్యక్తి ఫోటోను ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సదరు వ్యక్తి నెంబర్ ప్లేట్ కింద 'మై లైఫ్- మై రూల్స్' అంటూ రేడియం అంటించాడు. దానిని ట్విట్టర్లో షేర్ చేసిన ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ నువ్వు హెల్మెట్ ధరించినప్పుడే నీ లైఫ్ నీ చేతుల్లో ఉంటుందంటూ పేర్కొన్నారు. నీ రూల్స్ ఏంటో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియవని చెప్పారు. వాళ్లకు తెలిసిందల్లా మోటార్ వెహికిల్ యాక్ట్‌లోని సెక్షన్ 129(హెల్మెట్ ధరించకపోతే జరిమానా) మాత్రమేనన్నారు.
చివరగా నీ రూల్స్‌లో సేఫ్టీని చేర్చుకోమంటూ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి:'వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి'