Hyderabad Metro Service expansion : హైదరాబాద్ మెట్రో సర్వీసుతో నగర ప్రజలు ట్రాఫిక్ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ట్రాఫిక్ రద్దీని మరింత తగ్గించేందుకు ప్రయాణికుల ఇక్కట్లు తొలగించేందుకు రాష్ట్ర సర్కార్ మెట్రో విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ నెల 9న సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మిగతా ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలకు కూడా మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ డిమాండ్లు
- ఖాజాగూడ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్ మెట్రోని మణికొండ మీదుగా వేయాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దీంతోనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
- శంషాబాద్ వరకే పరిమితం చేయకుండా.. అక్కడి నుంచి ఆదిభట్ల వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆదిభట్ల మెట్రోరైలు సాధన పోరాట సమితినే ఏర్పాటు చేశారు. తొలుత ఆదిభట్లకు విస్తరించి.. తర్వాతి దశలో రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు విస్తరించాలని సూచిస్తున్నారు.
- ట్రాఫిక్ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎల్బీనగర్ నుంచి మెట్రోని హయత్‌నగర్ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
- పాతబస్తీలో ఆగిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోని పూర్తిచేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రత్యామ్నాయాలు: ప్రస్తుతం మెట్రో నిర్మించాలంటే కి.మీ.కు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అవసరమైన చోటే మెట్రో నిర్మించి మిగతాచోట్ల మెట్రో నియా తీసుకురావాలన్న దిశలో సర్కారు ఆలోచనలు ఉన్నాయి. మెట్రో నియోకి కి.మీ.కు రూ.110 కోట్లు అవుతుందని గతంలో అధికారులు తెలిపారు. తొలి మెట్రో నియో కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట మీదుగా ఓఆర్‌ఆర్ వరకు రాబోతుంది.
మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలివి..
- బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు(9.9కి.మీ.)
- ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట(9.1కి.మీ)
- ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం( 16.6 కి.మీ)
- ఎంజీబీఎస్-ఘట్‌కేసర్(23.2 కి.మీ.)
- జేబీఎస్-కూకట్‌పల్లి వై జంక్షన్(9.6కి.మీ)
- బోయిన్‌పల్లి-మేడ్చల్(19.2కిమీ.)
- ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ(15.9కి.మీ.)
- బీహెచ్‌ఈఎల్-దమ్మాయిగూడ(37.2 కి.మీ.)
- తార్నాక-కీసర ఓఆర్‌ఆర్(19.6కి.మీ.)
- చాంద్రాయణగుట్ట-రేతిబౌలి (16.1 కి.మీ.)
- నానక్‌రాంగూడ-బీహెచ్‌ఈఎల్(13.7 కి.మీ.)
ఇవీ చదవండి: