హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కొవిడ్ బాధితునికి పడక కావాలంటూ ఏ ఆసుపత్రిని సంప్రదించినా లేదనే సమాధానం వస్తోంది. అలాగే ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం గగనమవుతోంది. మూణ్నాలుగు రోజుల వరకూ నమూనాలను స్వీకరించలేమనే సమాధానం వస్తోంది. పడక కావాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా.. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకోవాలని ఆయా ఆసుపత్రులు, ల్యాబ్‌లు సూచిస్తుండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. కొన్ని సందర్భాల్లో పెద్దస్థాయిలో పైరవీలు చోటుచేసుకుంటున్నాయి.
50నుంచి 150 పడకలే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక పదవులు నిర్వహించిన ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారికి కొద్దిరోజుల కిందట కరోనా సోకింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడానికి ఓ ఉన్నతస్థాయి అధికారితో చెప్పించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్న సుమారు 25 కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ కోసం 2,000 పడకలు కూడా లేవు. ఒక్కో ఆసుపత్రిలో 500 నుంచి 800 వరకూ పడకలున్నా వాటిల్లో కొవిడ్ రోగుల కోసం ఒక్కో ఆసుపత్రి 50 నుంచి 150 పడకల వరకూ మాత్రమే కేటాయించాయి. మిగిలిన పడకలను సాధారణ రోగుల చికిత్సల కోసం పూర్వం మాదిరిగానే అట్టిపెట్టాయి.
48 గంటల తర్వాత చేరడానికి..
కొద్దిరోజుల కిందట మలక్‌పేటకు చెందిన ఓ కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు. కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఇంటి పెద్ద చనిపోగా, ఇతరులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్లోనూ మరొకరికి(39) కరోనా లక్షణాలు తీవ్రమయ్యాయి. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు 48 గంటల తర్వాత చేరడానికి ముందుగా పడకను రిజర్వు చేసుకుంటే.. బాచుపల్లి సమీపంలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో పడక లభించింది. మరోకేసులో ఇటీవల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఐదు రోజులున్న ఒక కరోనా బాధితునికి రూ.3.4 లక్షల బిల్లు వేశారు.
కొవిడ్ పరీక్ష చేయించుకు వస్తేనే చేర్చుకునేది!
శ్వాసకోశ సమస్యలున్నవారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ముందుగా కరోనా పరీక్షలు చేయించుకొని రావాలని సూచిస్తున్నారు. పాజిటివ్ కాకపోతేనే చేర్చుకుంటామని కొన్ని ఆసుపత్రులు కరాఖండీగా చెబుతున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షలకిస్తే ఫలితం రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది. నెగిటివ్ వస్తే అసలే సమాచారమూ తెలియదు. కాబట్టి ప్రైవేటులో చేర్చుకోవడం లేదు. మరి అప్పటి దాకా రోగి ఎక్కడుండాలంటే సమాధానం లేదు. అనుమానితులను ముందుగా చేర్చుకొని, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలిచ్చినా ప్రైవేటు ఆసుపత్రులు వాటిని పాటించడం లేదు.
సామర్థ్యానికి మించడంతో..
రాష్ట్రంలో 19 ప్రైవేటు ల్యాబ్‌ల్లో రోజుకు సుమారు 8,500 పరీక్షలు చేయడానికి అవకాశాలున్నాయి. గత వారం రోజుల్లో సామర్థ్యానికి మించి నమూనాలను స్వీకరించడంతో.. అత్యధిక ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ వందల సంఖ్యలో నమూనాలు పరీక్షల కోసం వేచి ఉన్నట్లు ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. 48 గంటల కంటే సమయం మించితే ఆ నమూనాల్లో కచ్చితత్వం లోపించే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని నమూనాల సేకరణను పరిమితం చేసినట్లుగా ఆ ప్రతినిధి వివరించారు.
వైద్యఆరోగ్యశాఖ ప్రకటించినా...
కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలపై పారదర్శకత కొనసాగిస్తామని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించినా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో ఎంతమంది అనుమానితులను చేర్చుకున్నారు? వారిలో ఎందరికి కరోనా పరీక్షలు చేశారు? వాటి ఫలితాలు ఏమిటి? ఐసోలేషన్, ఐసీయూ, వెంటిలేటర్‌తో కూడిన పడకలెన్నెన్ని ఉన్నాయి? వాటిలో ఏ విభాగంలో ఎందరెందరు చికిత్స పొందుతున్నారు? ఇంకా ఏ విభాగంలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయి? తదితర సమాచారమంతా ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అప్పుడు సందేహాలకు తావుండదు. అయితే ఈ విధానమేదీ ఇంకా గాడిలో పడలేదు. అలాగే జనరల్ వార్డులో చేరిన బాధితులకు సర్కారు ఖరారు చేసిన ధరలు వర్తింపజేస్తామని ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకటించగా ఆ జనరల్ వార్డుల్లో అసలెంత మంది ఉన్నారు? అనే స్పష్టత ఎవరికీ లేదు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో నాణ్యత ప్రమాణాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. వాటిల్లో నమూనాల సేకరణ, రుసుముల వసూలు, అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరీక్షలకు రూ.13,500
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(32)కి చిన్నతనం నుంచే ఆస్తమా సమస్య ఉంది. నాలుగైదు రోజులుగా ఆయాసంగా అనిపిస్తుండడంతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్ తీయించి.. బాగానే ఉందని చెప్పి మందులు రాసిచ్చారు. ఇంకో రెండు రోజులైనా తగ్గకపోగా జ్వరం వస్తుండడంతో.. కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆ ఆసుపత్రి వైద్యులు సూచించారు. పంజాగుట్టలోని ఒక ల్యాబ్‌కు వెళ్లారు. అక్కడ గంట సేపు వరుసలో నిలబడి వివరాలిచ్చాక రెండు రోజుల తర్వాత నమూనాలివ్వడానికి రావాలని చెప్పారు. ఎటూ పాలుపోని ఆ యువకుడు.. చివరకు తనకు తెలిసిన వారి ద్వారా పైరవీ చేయించుకొని బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే.. ఓపీ ప్రాతిపదికన ఇంట్లో ఐసోలేషన్ చికిత్స పొందాలనే నిబంధనలకు అంగీకరించి రూ.13,500 చెల్లించి, నమూనాలిచ్చారు. కొవిడ్ పరీక్షతో పాటు ఛాతీ స్కాన్, కొన్ని రక్త పరీక్షలు చేశారు. ప్రభుత్వం కొవిడ్ పరీక్షకు నిర్ధారించిన మొత్తం రూ.2,200.
నాలుగు ఆసుపత్రులు చేర్చుకోలేదు..
బాలాపూర్‌కు చెందిన ఒక సివిల్ ఇంజినీరు(55)కు శ్వాస సమస్య ఎదురైంది. బాలాపూర్ చౌరస్తాలో ఏ ఆసుపత్రికి వెళ్లినా చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో అక్కడికి సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. కొవిడ్ పరీక్ష చేయాలంటూ ఆ ఆసుపత్రి వర్గాలు నాలుగు గంటల పాటు అక్కడే ఉంచుకున్నారు. ఎటువంటి చికిత్స అందించకుండానే చివరకు పడకల్లేవని అక్కణ్నుంచి పంపించేశారు. మరో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే.. రూ.లక్ష కట్టాలన్నారు. చెల్లించడానికి సిద్ధమని చెబుతుండగానే.. ఆ పడక మరో రోగికి కేటాయించామంటూ పంపించేశారు. అంబులెన్సులో హైదర్‌గూడలోని ఇంకో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. జ్వరముందేమోనని చూసి కొవిడ్ అనుమానంతో చేర్చుకోలేదు. చివరకు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆ రోగి మృతిచెందారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు