హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పబ్‌ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. 18 ఏళ్లలోపు వారిని పబ్‌లలోకి అనుమతించకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
గచ్చిబౌలిలోని వాల్‌స్ట్రీట్ పబ్‌లోకి చిన్నారిని అనుమతించడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి పబ్‌లోకి వచ్చింది. ఈ దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. చిన్నారిని అసలు ఎవరు పబ్‌లోకి తీసుకువచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
చర్యలు తీసుకుంటాం..
చిన్నారిని పబ్‌లోకి అనుమతించిన ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు. సోషన్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించిన ఘటన ఆదివారం చోటుచేసుకుందన్నారు. దీనిపై గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌కు 188 ఐపీసీ కింద నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. పబ్ యజమానిపైనా కేసునమోదుచేసినట్లు తెలిపారు. పబ్‌ల్లోకి చిన్నారులకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
'ఆదివారం రాత్రి 11 మంది పురుషులు, నలుగురు మహిళలు.. గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌కు వచ్చారు. మొత్తం రూ.21 వేల బిల్లు అయింది. దీనిలో రూ.9 వేలు హెచ్డీఎఫ్సీ ద్వారా చెల్లించారు' అని డీసీపీ తెలిపారు. కార్డు ద్వారా బిల్లింగ్ చేసిన వారి సమాచారం సేకరించి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.
ఇదీచూడండి: Harish Rao: 'బొట్టు బిళ్లలకు, గడియారాలకు ఓటేస్తారా... అభివృద్ధికి ఓటేస్తారా..?'