కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే ప్రాణాధార ఔషధాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి రూ.35 లక్షలకు పైగా విలువ చేసే ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పారదర్శకంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కేసు నమోదు చేస్తామన్నారు.
కఠిన చర్యలు చేపడతాం..
ఔషధాల విషయంలో ఫార్మా సంస్థలు, మెడికల్ డిస్ట్రిబ్యూటరీలు, మందుల దుకాణా నిర్వాహకులు ఉల్లంఘనలకు పాల్పడితే గట్టి చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్కు చెందిన మెడికల్ డిస్ట్రిబ్యూటర్ వెంకట సుబ్రహ్మణ్యం ప్రధాన సూత్రధారిగా ఈ ఔషధాలను నల్లబజారుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి పలు చేతులు మారి చివరకు 10 రెట్ల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో స్పష్టమైందని సీపీ వివరించారు.
ఇవీ చూడండి : గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు: హైకోర్టు