- మాదాపూర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపారు. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసి బండిని నడుపుతున్నా చలానాలకు భయపడి నంబరు ప్లేటు వేయించలేదంటూ ఇద్దరమ్మాయిలు బదులిచ్చారు.
- ఆబిడ్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఓ యువకుడి కారును తనిఖీ చేశారు. నంబరు ప్లేటు టాంపరింగ్ చేసి ఉండటాన్ని గమనించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. వాహనం రిజిస్ట్రేషన్ జరిగినా కరోనాకు భయపడి రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లేందుకు వెనుకంజ వేశాడు. రహదారిపై ప్రయాణించేటపుడు పోలీసుల కన్నుగప్పేందుకు పాత వాహనం నంబరు తీసి కొత్త కారుకు తగిలించి నడిపిద్దామనుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కటంతో కేసు, జరిమానా తప్పలేదు.
మోహిదీపట్నంలోని రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు కేటాయించిన నంబర్ ప్లేట్లు(vehicle number plate issue) కుప్పలుగా పడున్నాయి. 2014-2019 సంబంధించిన నంబరు ప్లేట్లు దాదాపు 15,000-20,000 వరకూ గోదాములో మూలుగుతున్నాయి. మూడు జిల్లాల పరిధిలో సుమారు 2-3 లక్షల నంబరు ప్లేట్లు ఇదే విధంగా వాహనదారుల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. 2019 అక్టోబరు నుంచి కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్(vehicle registration telangana) పూర్తికాగానే సంబంధిత డీలర్ వద్దనే నంబరు ప్లేట్లు బిగిస్తున్నారు. అక్కడ కూడా గదుల్లో పెద్దఎత్తున హైటెక్ నంబరు ప్లేట్లు(vehicle number plate design) మూలపడేసి ఉండటం గమనార్హం. లక్షలు కుమ్మరించి కొనుగోలు చేసిన వాహనం నంబరు ఫ్యాన్సీగా(vehicle number plate design), హోదాకు తగినట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. వీటి తనిఖీల విషయంలోనూ పోలీసులు చూసీచూనట్టు వదిలేస్తుండటంతో మరింత అవకాశంగా మారింది. హైటెక్ నంబరు ప్లేట్లు పైకి కనిపించేంత నాణ్యతగా లేవనే ఆరోపణలున్నాయి. కొద్దిపాటి ఒత్తిడికి గురైనా వంగిపోవటం, విరిగిపోతుండటంతో కాస్త ఖరీదైన ప్రయివేటు దుకాణాల్లో నంబరు ప్లేట్లు తయారు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఫోన్ చేసినా స్పందన శూన్యం
కొత్త వాహనం కొనుగోలు చేశాక డీలరు ద్వారానే రిజిస్ట్రేషన్(vehicle registration telangana) ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాన్సీ నంబరు కోరుకునేవారు అదనంగా డబ్బు చెల్లించి లాటరీ ద్వారా దక్కించుకుంటారు. నంబరు కేటాయించగానే రవాణాశాఖ నుంచి వాహనదారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో దుకాణదారులు ఫోన్ల ద్వారా ఫలానా రోజు రమ్మంటూ వర్తమానం అందిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరించిన మొదటి, రెండో దశల్లో వాహనం కొనుగోలు చేసిన వారు అధికశాతం హైటెక్ నంబరు ప్లేట్లను వినియోగించేందుకు ఆసక్తి చూపట్లేదని సమాచారం. ఏడాదిగా తమ దుకాణాల్లో సుమారు 20,000-30,000 వరకూ నంబరు ప్లేట్లు ఉన్నాయంటూ ప్రముఖ ద్విచక్రవాహన కంపెనీ డీలరు ఒకరు వివరించారు. ఫోన్ చేసినా అట్నుంచి స్పందన రావట్లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. నిర్లక్ష్యం, జరిమానాలు, కార్యాలయానికి వెళ్లి సమయం వెచ్చించాల్సి రావటం వంటి కారణాలతో వాహనదారులు ప్రైవేటుగా నంబరు ప్లేట్లు ఫిట్ చేయించుకుంటున్నారని రవాణాశాఖ అధికారి ఒకరు వివరించారు. రుణం తీసుకుని వాహనం కొనుగోలు చేసిన కొందరు వాయిదాలు చెల్లించలేక నంబరు ప్లేట్లను తొలగించి ఉపయోగిస్తున్నారు. ఫైనాన్స్ సంస్థలు వసూలు బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాయి. వాహన ఛాసిస్ నంబర్లు ఇచ్చి వాహనాలను వెతికి అప్పగిస్తే పెద్ద ఎత్తున కమీషన్ ఇస్తామంటూ ఆశచూపడంతో వారు నంబరు ప్లేటు లేనివాటిని ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు.
ఇదీ చదవండి: చికిత్స పొందుతూ విశాఖ ప్రేమోన్మాది హర్షవర్దన్‌రెడ్డి మృతి