రాజధానిలో ఎంఎంటీఎస్ రైళ్లు తిరగడం మానేసి పది నెలలవుతోంది. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు, రోజూ నగరంలోని వివిధ సంస్థలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, చిరు వ్యాపారుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రస్తుతం జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. కరోనా భయం చాలావరకు తగ్గింది. రోజూ 2వేల వరకు బస్సులను ఆర్టీసీ తిప్పుతోంది. మెట్రో రైళ్లలోనూ నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తూ ప్రయాణికుల ఆదరణ పొందిన ఎంఎంటీఎస్ రైళ్ల ఊసు మాత్రం లేదు.
తక్కువ సమయంలో గమ్యానికి
నగరంలో చౌకైన ప్రయాణ వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ఎంఎంటీఎస్ రైలే. కేవలం పది రూపాయలతో 20 కి.మీ. వెళ్లొచ్చు. కొవిడ్ ముందు వరకు రోజూ తిరిగే 121 సర్వీసుల్లో 1.80 లక్షల మంది ప్రయాణించేవారు. సాధారణంగా లింగంపల్లి నుంచి నాంపల్లికి బస్సులో వెళ్లాలంటే రద్దీ సమయంలో గంట సమయం పడుతుంది. అదే ఎంఎంటీఎస్‌లో 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అనేకమంది ఉద్యోగులు, చిరు వ్యాపారులు.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా ఎంఎంటీఎస్‌లలో నగరానికి వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళుతుంటారు. గతేడాది మార్చి 24 నుంచి ఈ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. అప్పటి నుంచి వీరందరికీ కష్టాలు మొదలయ్యాయి. సొంత వాహనాలు లేక, ఉన్నా ఇంధన ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రవాణా సాధనాల్లో వెళ్లినా ఎంఎంటీఎస్‌తో పోల్చితే తడిసి మోపెడవుతోంది.
ముంబయి మహానగరాన్ని కరోనా వణికించింది. లక్షమందికి పైగా ఈ వైరస్ బారినపడగా అనేకమంది చనిపోయారు. అయినా ఆ నగరంలో లోకల్ రైళ్లను నడపడానికి రైల్వే శాఖ అనుమతించింది. రోజూ 2342 సర్వీసుల్లో 75.93 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. కొత్త కేసులూ అధికంగా లేవని, అంతా సాధారణంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదే హైదరాబాద్ చూస్తే ముంబయిలో మాదిరి విస్తృత కేసులు నమోదుకాలేదు. వేలమంది కోలుకున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌లు నడిపే అవకాశాలు పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పరిమిత సంఖ్యలో తిప్పడంపై పరిశీలన
ప్రస్తుతం లక్షలమంది స్టాప్‌వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో గతంలో మాదిరి హడావిడి లేదు. దీనివల్ల ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించేవారు ఎక్కువమంది ఉండే అవకాశం లేదని భావిస్తున్నాం. అందుకే తిప్పడం లేదు. పరిమిత సంఖ్యలో సర్వీసులను నడిపే విషయంపై పరిశీలన చేస్తాం.
గజానన్ మాల్య, జీఎం, దక్షిణమధ్య రైల్వే
ఇదీ చదవండి: ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం