Hyderabad metro train ticket fare hike: భాగ్యనగరంలో మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్‌గా కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సభ్యులుగా కమిటీని నియమించింది.
ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్ ప్రయాణికులను కోరారు. మెయిల్ ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కోరారు.
కమిటీకే అధికారం: మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్(ఎంఆర్‌ఏ)కు మొదటిసారి మాత్రమే ఛార్జీలు పెంచే అధికారం ఉంటుంది. సాధారణంగా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి కాబట్టి వారే ఎంఆర్‌ఏగా ఉంటారు. హైదరాబాద్‌లో మెట్రో పీపీపీ విధానంలో చేపట్టారు. ఇక్కడ మెట్రోని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ హైదరాబాద్ ‘ఎంఆర్‌ఏ’గా ఉంది.
ఆ మేరకు ఎల్ అండ్ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆరంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. సవరించాలంటే కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే సాధ్యం. ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించాలని కేంద్రాన్ని కోరడంతో గత నెలలో కమిటీ ఏర్పాటైంది. ‘ఛార్జీలు ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదు.
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుంది’ అని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రోలో టిక్కెట్ ప్రస్తుతం కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60గా ఉంది. 2017 నవంబరు 28న ఈ ఛార్జీలను నిర్ణయించారు. అప్పట్లో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను నిర్ణయించింది.
ఇవీ చదవండి: