Hyderabad Metro Staff Protest: హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ సిబ్బంది.. వేతనాలు పెంచాలంటూ నిరసనబాటపట్టారు. ఎల్ బీనగర్-మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్ల టికెటింగ్ సిబ్బంది తమకు సరైన వేతనాలు అందించడం లేదని విధులు బహిష్కరించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది టికెటింగ్ సిబ్బంది.. 3 ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
టికెటింగ్ సిబ్బంది మెరుపు ఆందోళనతో, మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. అనంతరం ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు.. నిర్వాహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామనన్నారని ఉద్యోగులు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు.. విధులకు మాత్రం హాజరుకామని టికెటింగ్ సిబ్బంది స్పష్టంచేశారు.
ఉదయం నుంచి టికెటింగ్ ఉద్యోగుల ఆందోళనతో.. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో స్టేషన్లలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అక్కడక్కడ కొన్ని స్టేషన్ల వద్ద భారీగా ప్రయాణికులు బారులు తీరారు. మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళనపై హైదరాబాద్ మెట్రో వర్గాలు స్పందించాయి. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని.. నగరంలో సమయం ప్రకారం మెట్రోరైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.
ఇవీ చదవండి: