Hyderabad Metro Latest news : హైదరాబాద్ మెట్రో రైలు 5 లక్షల ప్రయాణికుల సంఖ్యను దాటింది. సోమవారం ఒక్క రోజే హైదరాబాద్ మెట్రోలో 5లక్షల10 వేల మంది ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 40 కోట్ల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. శనివారం గ్రూప్ -4 పరీక్ష కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లడం, ఆదివారం సెలవు తరువాత అందరూ తిరిగి రావడంతో పాటు సోమవారం గురుపౌర్ణమి కావడం కూడా మెట్రోకు కలిసొచ్చింది.
Hyderabad Metro Records : మెట్రో రైలును ప్రారంభించిన మొదటి రోజే 2 లక్షల మంది ప్రయాణించారు. ప్రస్తుతం సగటున సుమారు 4.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు లక్షలపైగా ప్రయాణించారు. మెట్రో రైలును ప్రవేశపెట్టినప్పటి నుంచి భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కొంత వరకు తగ్గాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని వేగంగా, సౌకర్యవంతంగా చేరుకుంటున్నారు. 50శాతం నుంచి 75శాతం ప్రయాణ సమయాన్ని మెట్రో ఆదా చేస్తుంది. ఇటీవలే విద్యార్థులకు మెట్రో పాస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Hyderabad Metro Interduce Student Pass : ఇటీవల విద్యార్థుల సౌకర్యార్థం మెట్రో రైలుల్లో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ని జులై 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఈ పాస్ని ఉపయోగించుకోవాలని కోరారు. 1998 ఏప్రిల్ 1 తరువాత పుట్టిన ప్రతి ఒక్కరు ఈ పాస్ పొందేందుకు అర్హులు అని తెలిపారు. ఈ పాస్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి 30 రోజులు చెల్లుబాటు అవుతుందని చెప్పారు.
అయితే మెట్రో రైలులో ప్యాసింజర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్లుగా కోచ్‌ల సంఖ్య పెరగడం లేదు. దీనిపై ప్రయాణికులు పలుమార్లు తన నిరసన వ్యక్తం చేశారు. కేవలం మూడే కోచ్‌లు ఉండడంతో ఉదయం, సాయంత్రం సమయం ఆఫీస్ వేళ్లలో రద్దీ విపరీతంగా పెరిగి సిటీ బస్సులను తలపిస్తున్నాయని పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా మెట్రో ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున.. కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల మెట్రో స్టేషన్లలోని టాయిలెట్స్‌కు కూడా ఛార్జీలు వసూల్ చేయడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.
Hyderabad Metro History : హైదరాబాద్ మెట్రో రైలును 2017 నవంబర్ 29న ప్రారంభించారు. 2017లో మొదటి దశ నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు ప్రారంభించింది. అనంతరం రెండో దశగా ఎల్బీ నగర్ నుంచి అమీర్‌పేట మార్గాన్ని అక్టోబర్ 2018లో మొదలు పెట్టారు. అమీర్‌పేట- హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. జేబీఎస్- ఎంజీబీఎస్ రవాణా మార్గం 2020 ఫిబ్రవరి నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 69 కిలోమీటర్లులో అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రో ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా మెట్రో ప్రాజెక్ట్ కారిడార్-4ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం దాల్చింది. ఈ మార్గం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో పెద్ద మెట్రోగా పేరుపొందింది.
ఇవీ చదవండి :