Metro extension to Shamshabad Airport: సాధ్యమైనంత మేర ప్రైవేట్ ఆస్తుల సేకరణను తగ్గించేలా ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్ ఖరారుచేయాలని భావిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ఇంజినీర్లతో కలిసి ఆయన పరిశీలించారు. నార్సింగి నుంచి రాజేంద్రనగర్ గుట్ట వరకు 10 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్ పరిశీలించారు.
స్టేషన్లను సులువుగా చేరుకోవడానికి ఓఆర్‌ఆర్ అండర్‌పాస్‌లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లు నిర్మించాలని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్‌లో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించబడిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్ ప్లాన్ చేయాలని సూచించారు. స్కైవాక్, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్ ప్లానింగ్‌లో అంతర్భాగంగా ఉండాలని సూచించారు. మెట్రో ప్రయాణం మరింత వేగవంతం చేయడానికి, సజావుగా సాగేలా చేయడానికి కొన్ని ప్రదేశాలలో వంపులు లేకుండా సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
మెట్రో పిల్లర్లు నానక్‌రామ్‌గూడ జంక్షన్ నుంచి అప్పా వరకు విస్తరించిన సర్వీస్‌రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కారిడార్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన వాణిజ్య మరియు నివాస భవనాల నివాసవాసుల అవసరాలను తీర్చడానికి భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కొరకు కొన్ని గుర్తించబడిన ప్రదేశాలలో ఏర్పాట్లు ఉండాలన్నారు.
స్టేషన్ల కోసం పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి మరియు ప్రాజెక్ట్ వేగవంతం చేయడానికి తాత్కాలిక కాస్టింగ్ యార్డుల ఏర్పాటు కోసం కారిడార్ సమీపంలో తగిన బహిరంగ ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. స్టేషన్ల యాక్సెస్ పాయింట్లు కొత్త సైకిల్ ట్రాక్‌కు అనుగుణంగా ఉండాలని.. పర్యావరణహితంగా స్టేషన్లు చేరుకోవడానికి ఆ ట్రాక్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Express Metro Project: హైదరాబాద్ నగరం నుంచి శరవేగంగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గత నెలలో శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. కలిపే ఈ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. మైండ్‌స్పేస్ కూడలి నుంచి 0.9 కి.మీ. దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో ప్రారంభం అవుతుంది.
ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్‌మెంట్ వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో ఎలైన్‌మెంట్ రూపొందించారు.
ఇవీ చదవండి: