ఈనెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా చిరునవ్వులు కానుకగా ఇవ్వాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసి వారి చిరునవ్వులను కేటీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు.
బొకేలు, శాలువాలు, హోర్డింగ్ల కోసం ఖర్చు చేయకుండా వస్తు, ధన రూపాల్లో వ్యక్తిగత, సామాజిక అవసరాలు తీర్చాలని సూచించారు. వాటి ఫొటోలు, వివరాలను కేటీఆర్ ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేయాలని చెప్పారు.
మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించినట్లు బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.