విద్యార్హత అంతంతమాత్రమైనా ఫర్వాలేదు. నైపుణ్యం ఉంటే చాలు.. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నగరం యానిమేషన్ హబ్‌గా మారుతున్న తరుణంలో చాలా కంపెనీలు వేల మంది అభ్యర్థులు కావాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.
అన్నీ ఇక్కడి నుంచే
నగరంలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అనేక గేమింగ్, యానిమేషన్ సంస్థలు వెలిశాయి. డిజిటల్ డొమైన్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్, పర్పుల్‌టాక్, రోటో మేకర్ తదితర సంస్థలు ఇక్కడున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన యానిమేషన్ సినిమాలకు, గేమ్‌ల పాత్రలకు ఇక్కడే జీవం పోస్తున్నారు. లైఫ్ ఆఫ్ పై సినిమా నిర్మాణం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. తెలుగు వ్యక్తి అయిన ప్రవీణ్ కిలారు పర్యవేక్షించారు. బాహుబలి సినిమా వీఎఫ్‌ఎక్స్ అంతా ‘మకుట’లో జరిగింది. ఛోటా బీమ్, మైటీ రాజు, చోర్ పోలీస్, మైటీ లిటిల్ బీమ్ తదితరాలన్నీ గ్రీన్‌గోల్డ్ యానిమేషన్‌లో రూపొందాయి.
వేలాది ఉపాధి అవకాశాలు
ప్రపంచస్థాయి కంపెనీలు నగరంలో తమ శాఖలను నెలకొల్పాలని ఆసక్తి చూపిస్తున్నాయి దీంతో గేమింగ్ డెవలపర్లకు, గ్రాఫిక్ డిజైన్, మీడియా టెక్నాలజీ, వీఆర్‌కాన్సెప్ట్స్, గేమ్ థియరీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తదితర రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో కంపెనీ ఏటా వివిధ విభాగాల్లో నైపుణ్యం ఉన్న 800-1000 మంది కావాలని అడుగుతున్నాయి. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను కలిపితే కేవలం 16-20 మాత్రమే ఉన్నాయి. ఇందులో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందుతున్న వారు కేవలం 200 నుంచి 300 వరకు మాత్రమే ఉంటున్నారని గేమింగ్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రఖ్యాత గేమింగ్ స్కూళ్ల ఏర్పాటు
ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో గేమింగ్ కోర్సుల్లో నైపుణ్యం పొందినవారికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో పోటీ 1ః5గా ఉందని గేమింగ్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. వరల్డ్ డిస్నీ, డ్రీమ్ వర్క్స్ కంపెనీలు నగరంలో తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
నైపుణ్యం పొందితేనే
గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ రంగాల్లో నగరంలో పుష్కల అవకాశాలున్నాయి. శిక్షణ పొందడం మాత్రమే కాదు.. నైపుణ్యం సాధిస్తే రూ.లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. ఇలా నైపుణ్యం పొందినవారు వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్‌లో ప్రతిభ చూపితే ప్రపంచస్థాయి కంపెనీలు ఆకర్షించే వేతనాలతో ఉపాధి కల్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఈ పోటీల్లో శ్వేత రతన్ గ్రాఫిక్ డిజైన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రతిభ కనబరిచింది. శాంసంగ్ కంపెనీ రూ.40లక్షల ప్యాకేజీతో ఆమెకు ఉద్యోగమిచ్చింది. - సయ్యద్ జునైద్, డిజిక్వెస్ట్ ప్రతినిధి
- ఇదీ చదవండి: శుద్ధి తర్వాతే భక్తులకు అనుమతి