హైదరాబాద్ మలక్‌పేట యశోద ఆస్పత్రిపై హైదరాబాద్ డీఎంహెచ్‌వో విచారణకు ఆదేశించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్వేతారెడ్డి అనే మహిళకు చికిత్స కోసం రూ.29 లక్షలు వసూలు చేసి... మృతదేహం అప్పగించారనే ఫిర్యాదుపై కమిటీని ఏర్పాటు చేసింది. మూడురోజుల్లో ఘటనపై సమగ్ర విచారణ జరిపి... నివేదిక సమర్పించాలని పేర్కొంది. శాలివాహననగర్, మలక్‌పేట యూపీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ పి.వీణ, డాక్టర్ పి.జయమణిలను విచారణ అధికారులుగా నియమించింది.
ఏం జరిగిందంటే
హైదరాబాద్‌లో ఏసీటీవోగా పనిచేస్తున్న శ్వేతారెడ్డి కాన్పు కోసం ఆగస్టు 4న ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయిన రెండు రోజుల తరువాత శ్వేతారెడ్డికి కొద్దిగా ఆయాసం రావడంతో కొవిడ్ పరీక్ష చేశారు. ఫలితం నివేదిక చూపించకుండానే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 20 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పరీక్షల నివేదికలు ఇస్తే... వేరే వైద్యుల అభిప్రాయం తీసుకుంటామని ఆమె భర్త అడగడంతో... మృతి చెందిందంటూ మరుసటిరోజు వైద్యులు చెప్పారని హైదరాబాద్ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.