8 రోజుల్లోనే ఆరోగ్యంగా..
నేను నివాసముండే జీడిమెట్లలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. నాకు ఓరోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలింది. నాకు ఇతర ఏ లక్షణాలూ లేవు. ఇంటి వద్దే వైద్యం పొందుతానని చెప్పడంతో వైద్యులు సరేనని అన్ని రకాల సలహాలిచ్చారు. కుటుంబీకులకు ఇబ్బంది కలగకూడదని పైన ఉన్న గదిలో ఒక్కడినే ఉన్నా. నాకు ఆహారం, కషాయాలను ఓ సంచికి తాడు కట్టి పైకి పంపించేవారు. నేను ధైర్యంగా ఉండటంతో పాటు వారికి భరోసానిచ్చాను. మిత్రులు వీడియోకాల్ చేసి మాట్లాడేవారు. టీవీలో వినోద కార్యక్రమాలు చూసేవాడిని. పౌష్టికాహారం తీసుకున్నాను. సీ విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, ఇతర మాత్రలు రోజూ వాడాను. నిత్యం గంట వ్యాయామం, యోగా అలవాటు చేసుకున్నాను. 8 రోజుల్లోనే ఆరోగ్యవంతుడినయ్యాను. మరో 14రోజులు ఇదే పద్ధతి కొనసాగించాను.
- వ్యాపారి(36), జీడిమెట్ల
పదిరోజుల్లో కోలుకుని తిరిగొచ్చాను
విధి నిర్వహణలో భాగంగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. అనారోగ్య లక్షణాలేవీ లేకున్నా ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకున్నాను. రెండురోజుల తర్వాత పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనతో గాంధీ ఆసుపత్రికి వెళ్లాను. రెండురోజుల తర్వాత నా కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిసి మనసు తేలికపడింది. దాదాపు పదిరోజులు గాంధీ వైద్యులు మందులు, మంచి ఆహారం అందించారు. సమయానికి అడిగినవన్నీ ఇచ్చారు. అనంతరం నెగెటివ్ రావడంతో ఇంటికి వచ్చాను. మరో వారం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నాను. పండ్లు, ఉడకబెట్టిన గుడ్లు, కషాయం తీసుకుంటున్నాను. మనలోని భయాన్ని అధిగమిస్తే కరోనాని సులువుగా ఓడించవచ్చు.
- మెడికల్ రిప్రజెంటేటివ్(32), జీడిమెట్ల
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు