గూడు కట్టే కార్మికులకు ఉపాధి కరవైంది. చేతి నిండా పని లేక కడుపు నిండా తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోలక్షలాది మంది కూలీలు, కార్మికులు... సమస్యల వలయంలో చిక్కుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడింది. 20 అనుబంధ రంగాల్లోనూ ఇదే దుస్థితి. రోజుల తరబడి పనులు లేకపోవటం వల్ల వారంతా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆ అప్పు కూడా పుట్టటం లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొందరు వేరే ఉపాధి చూసుకుంటున్నారు. మరికొందరు పనుల్లేక.. పస్తులు ఉండలేక.. సొంతూళ్లకు బయలుదేరాలని చూస్తున్నారు.
దిక్కు తోచని స్థితిలో
భవనాలు నిర్మించే కార్మికుల నుంచి ఎలక్ట్రీషియన్ల వరకు...అడ్డాకూలీ నుంచి స్టీల్ రవాణా చేసే ఆటోవాలా వరకు...ఇలా అందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కార్మిక శాఖ వద్ద నమోదు చేసుకున్న లెక్కల ప్రకారం తెలంగాణలో 14 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. నమోదు చేసుకోని కార్మికులు మరో 6 లక్షల వరకు ఉంటారని అంచనా. మొత్తంగా సుమారు 20 లక్షల వరకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్లలో ఎన్నడూ ఖాళీగా లేమని.. చేతి నిండా పని దొరికేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు.
మినహాయింపులు ఇచ్చినా...
వీరి సమస్యలు గమనించిన కేంద్ర ప్రభుత్వం... భవన నిర్మాణ రంగానికి లాక్‌డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు ప్రారంభించాయి. నిర్మాణానికి అవసరమైన సామగ్రి సాఫీగా అందేలా... కార్మికుల్లో విశ్వాసం కల్పించే చర్యలు చేపట్టాలని ప్రాజెక్ట్ డెవలపర్స్‌కు సూచనలు వెళ్లాయి. అయితే అది అనుకున్నంత సాఫీగా కనిపించటం లేదు. ప్రధానంగా పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడే పనులు ప్రారంభించే అవకాశం తక్కువగా ఉంది. వాటిల్లో పనిచేయాల్సిన ఇతర రాష్ట్రాల కూలీలు తిరిగి వెళ్లిపోవటం వల్ల ఆ పనులు చేసేవారికి కొరత ఏర్పడనుంది. అది ఇక్కడి వారిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
వెంటాడుతున్న భయం
భవన నిర్మాణ రంగ క్యాంపుల వద్ద ఉండే కార్మికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కార్మికులకు ఊరటనిచ్చేందుకు ఈ మినహాయింపులు ఇచ్చినప్పటికీ... ఇప్పుడప్పుడే భవన నిర్మాణ రంగం కోలుకుంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రధాన కారణం... కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు. చాలామంది సొంతూళ్లు వదిలి హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కరోనా భయం వారిని వెంటాడుతూ ఉన్నందున వారంతా సొంత గూటికి చేరుకోవాలన్న ఆశతో ఉన్నారు. క్రమంగా ఒకరితరవాత ఒకరు స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఈ విషయమై అధికారులు ఎన్ని తీర్లుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... వారు ఇక్కడ ఉండేందుకు అంగీకరించటం లేదు. కష్టమైనా సుఖమైనా అక్కడే అని తేల్చి చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్ని చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ నిధితో ఆదుకోవాలి
సాధ్యమైనంత త్వరగా కొంతమందికైనా కార్మికులకు పని ఇవ్వగలిగితే, అభివృద్ధి పనులు ముందుకెళ్తాయనే ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి కేటాయింపుల ద్వారా వారిని ఆదుకోవాలి. ఆ మేరకు ఆ నిధులు ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఆ దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తే వాళ్ల అర్ధాకలి బతుకులకు కాస్తైనా ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కుటుంబ పోషణ కోసం కూలి పనులకు విద్యావంతులు