రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే... విద్యా సంవత్సరం షెడ్యూలును ఖరారు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. తరగతులు, పరీక్షల నిర్వహణపై దేశంలోని యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. విద్యా సంవత్సరం ప్రారంభంపై హెచ్సీయూ స్పష్టతనిచ్చింది. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ ఉన్నందున.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని యూనివర్సిటీ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల విద్యార్థులు తిరిగి రావల్సి ఉన్నందున.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీ భావిస్తోంది. యూజీసీ కేవలం సూచనల రూపంలోనే మార్గదర్శకాలు జారీ చేసినందున... దేశవ్యాప్త పరిస్తితులు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని హెచ్సీయూ వర్గాలు తెలిపాయి.
జూన్లో తలపెట్టిన ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశీలిస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ... భౌతిక దూరం వంటి పలు ఆంక్షలు అమల్లో ఉండే అవకాశమున్నందున ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని అంతర్గత సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. ఎంట్రన్స్లకు దరఖాస్తుల గడువును ఇప్పటికే మే 22 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా సుమారు 60వేల మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అవకాశముంది. అధ్యాపకులకు వేసవి సెలవులను మే 22 వరకు కుదిస్తూ హెచ్సీయూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న విద్యార్తులకు ఆన్లైన్ విధానాల ద్వారా బోధిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్