ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం అధికారయంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటి నుంచి బడికి బస్సులో వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చేలా సాఫీ ప్రయాణం సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఈ నెల 13 నుంచి విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీస్ విభాగం సంయుక్తంగా దాడులు చేపట్టాయి.
ఆరు బృందాలతో వేట మొదలైంది..
రవాణా శాఖ నుంచి ఆరు బృందాలను కేటాయించారు. ఇందులో మోటర్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు.... రవాణాశాఖ సిబ్బంది ఉన్నారు. ఒక్కో బృందానికి ట్రాఫిక్ ఏసీపీ నేతృత్వం వహిస్తారు. ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఏఎంవీఐ, రవాణా శాఖ కానిస్టేబుల్ బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 నిమిషాల నుంచి 9.30 గంటల వరకు.... సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో వాహనం యొక్క ఫిట్ నెస్ సర్టిఫికెట్, డ్రైవర్లు లైసెన్స్ పరిశీలిస్తున్నారు. శ్వాస పరీక్షలలో మద్యం సేవించినట్లు తేలితే వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
రెండు రోజుల్లో 800 కేసులు
ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల పాటు చేపట్టిన తనిఖీల్లో 800కు పైగా కేసులు నమోదయ్యాయి. పరిమితికి మించి పిల్లల్ని తీసుకెళ్లడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో కేసులయ్యాయి. ఇందులో ఆటోలు 700. 150కి పైగా బస్సులపైనా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో సుమారు 1500కు పైగా ప్రైవేట్ పాఠశాలల బస్సులున్నాయి. వేయి వరకు వ్యాన్లున్నాయి. 10వేల వరకు ఆటోలు విద్యార్థుల్ని తరలిస్తున్నాయి. పాఠశాల యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు వాహనాల యొక్క సామర్థ్యం, డ్రైవర్ లైసెన్స్, వాహన బీమా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
వాట్సప్‌కు ఫిర్యాదు చేయండి
ఒకవేళ పాఠశాల బస్సులు, ఆటోలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుంటే..ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. 9010203626 చరవాణికి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది..
తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించే వాహనాల విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిమితికి మించి వెళ్లే ఆటోల్లో పిల్లలను పంపించొద్దని కోరుతున్నారు. ఇదే విషయమై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, డ్రైవర్లతోనూ సమావేశాలు నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'