కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో.. ఆకలితో అల్లాడిపోతున్న అన్నార్థులను ఆదుకునేందుకు వేదం ఫౌండేషన్ ముందుకొచ్చింది. గతేడాది లాక్డౌన్లో నగరంలోని వివిధ ఆసుపత్రుల వద్ద.. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని అందించి (food distribution) మానవత్వాన్ని చాటుకున్న సంస్థ వ్యవస్థాపకులు అరవింద్.. రెండో దశ లాక్‌డౌన్‌లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. యూసఫ్ గూడలోని ఓ కిచెన్‌ను అద్దెకు తీసుకొని ప్రతిరోజు దగ్గరుండి ఆహారాన్ని తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నారు. రోజుకు సుమారు 2 వేల మంది ఆకలి తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
స్విగ్గీ, జొమాటో ద్వారా..
అరవింద్.. 15 రోజులుగా గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల వద్ద బాధిత కుటుంబాలకు రెండు పూటల నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, అమీర్ పేట ప్రాంతాల్లోని 350 మంది కొవిడ్ బాధితులకు.. స్విగ్గీ(Swiggy), జొమోటో(Zomato) ద్వారా ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడుతోన్న ఆర్టీసీ కార్మికులకూ అండగా నిలుస్తున్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం.. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అరవింద్ అంటున్నారు.
ఇదీ చదవండి: కరోనాతో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి మృత్యువాత