తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకురాని పరిస్థితి. రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఎక్కడెంతంటే..
రాష్ట్ర వ్యాప్తంగా 44 నుంచి 46డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా... మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 45.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తక్కువగా చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో 41.9, వనపర్తిలో 42.3డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్లో భానుడి ప్రతాపం 43.4 డిగ్రీలుగా ఉంది.
మరో మూడు రోజులు తప్పదు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వడగాలులు అధికంగా వీస్తాయని... ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వీటి ప్రభావం అధికంగా ఉంటుందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో పాటు... వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
జర జాగ్రత్త
ఎండలతోపాటు తీవ్ర వడగాడ్పులతో దినసరి కార్మికులు, పేదలతో పాటు చిరువ్యాపారులు, కూరగాయాల విక్రయదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చిన్నపిల్లలు, వృద్ధులు వేడిమి తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!